-S.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్
-దిగుబడులు పెంచి స్థానిక రైతులకు ఆదర్శంగా నిలవండి
-తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతులు ,నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న నానో యూరియా ,నానో డిఎపీ లను విత్తన అభివృద్ధి క్షేత్రాలలో వినియోగించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రసాదంపాడు లో వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం లో బుధవారం వ్యవసాయ శాఖ ఆధీనంలో రాష్ట్రములో ఉన్న విత్తన ఉత్పత్తి కేంద్రాలు , ప్రాజెక్టు అభివృద్ది ప్రదర్శన క్షేత్రాల విత్తన అభివృద్ది అధికారులతో శ్రీ S డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ వారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రారంభ ఉపన్యాసం లో వారు మాట్లాడుతూ రాష్ట్ర విత్తన అభివృద్ధి క్షేత్రాలలో అమలులోవున్న మూల విత్తనాల ( ఫౌండేషన్ విత్తనం) సాగు ఉత్పత్తిలో క్షేత్ర అధికారులు ఉన్నత నాణ్యత ప్రమాణాలు అమలుపరిచి ,రైతులకు అందించాలని ఆదేశించారు .విత్తన అభివృద్ధిలో ఇతర విత్తనాలు కలవకుండా ముందుగానే సాగులో బెరుకులను గుర్తించి ఏరి వేయటం , పూత దశలో తేడా ఉన్నవాటిని తొలగించటం ,పక్క క్షేత్రములలోని సాగురకముల విత్తనాలు కలవకుండా తగిన దూరం (ఐసోలేషన్ దూరం)పాటించడం , కోత,నూర్పిడులలో ఇతర రకాలను కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బెరుకులు లేని నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు .
వ్యవసాయ విత్తన అభివృద్ధి క్షేత్రాలలో మరింత ఉత్పత్తి పెంచటానికి శాఖాపరంగా కావలసిన సహకారం అందిస్తామని, విత్తన ఉత్పత్తిలో అధిక దిగుబడులు సాధించి మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు . విత్తన క్షేత్రాలలో వినియోగం లో లేని సాగు భూమిని వినియోగం లోనికి తేవాలని ఆదేశించారు. ఆక్రమణలకు గురిఅయ్యి అన్యాక్రాంతం అయ్యిన క్షేత్రాల వివరాలు ,కోర్టు కేసులు ,రెవెన్యూ సమస్యలు వున్న వివరములను సత్వరమే తెలియచేయాలని ,తద్వారా ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి ,సత్వర పరిష్కారం చూపించ గలమని తెలిపారు. ఈ కార్యక్రమములో వ్యవసాయ అదనపు సంచాలకులు వల్లూరి శ్రీధర్ ,సంయుక్త సంచాలకులు (విత్తనం) వి. కృపాదాస్ లు రాష్ట్రములోని అన్ని విత్త నాభివృద్ధి కేంద్రాల వారీగా ఉత్పత్తి ,పంపిణీ తదితర విషయాలను సమీక్షించారు.
Prajavartha Online Telugu News