-నిర్థేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం..
-జిల్లాకలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు మంజూరైన 767 ప్రభుత్వ భవనాలలో 241 నిర్మాణాలను పూర్తి చేశామని మిగిలిన 526 భవననిర్మాణాలను సెప్టెంబర్ మాసాంతంలోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించి పనులు వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రగతిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోనశశిధర్‌లు శనివారం రాష్ట్రానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రగతిని వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నిర్థేశించిన గడువులోపు నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాకు 268గ్రామసచివాలయల భవనాలు, 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 260 రైతుభరోసా కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో 241 భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ భవన నిర్మాణాల మేళాను నిర్వహించి మిగిలిన 526 భవన నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రాముఖ్యతను గుర్తించి 14.46 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబరు మాసాంతానికి భవన నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించామని కలెక్టర్ తెలిపారు. జూలై మొదటి పక్షానికి 27, రెండవ పక్షంలో 43 భవనాలు, ఆగస్టు మాసం మొదటి పక్షానికి 69, రెండవ పక్షానికి 145 భవనాలు, సెప్టెంబరు మాసం మొదటి పక్షానికి 95, రెండవ పక్షంలో 147 భవనాలను పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై ప్రతీ వారం సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భవన నిర్మాణాలకు అవసరమైన సిమెంటు, స్టీల్, ఇసుక, కంకర వంటి నిర్మాణ సామాగ్రి సిద్దంగా ఉంచామన్నారు. నాణ్యత ప్రమాణాలతో ప్రభుత్వ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు.