Breaking News

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యానికి గత ప్రభుత్వ చర్యలే కారణం…

-జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి కాపర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్ల జరిగిన నష్టానికి గత ప్రభుత్వమే కారణమని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలశ్యమవుతున్నదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ ఇరిగేషన్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్పిల్ వే నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారని దీనితో 400 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని మంత్రి అన్నారు. దీన్ని ఎలా పునరుద్ధరించాలి? అని నిపుణులు తలలు పట్టుకుంటున్నారని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నా లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చినా ప్రాజెక్ట్ కు ఎటువంటి నష్ట్రం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే పూర్తి చేసిందని స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్ కూడా మా ప్రభుత్వమే పూర్తి చేసిందని మంత్రి అన్నారు. 28 లక్షల క్యూసెక్కులు వరద నీరు వచ్చినా ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ దగ్గరే ఉండి పోలవరం ప్రాజెక్ట్ ను కాపాడుకున్నారని ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ను, ఇరిగేషన్ అధికారులను మంత్రి అభినందించారు.
ఇరిగేషన్ కాపర్ డ్యామ్ అంటే తెలియదని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మంత్రిగా సాంకేతిక అంశాలు తెలియవల్సిన అవసరం లేదు కానీ నాకు కామన్ సెన్స్ ఉందని పోలవరం ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన ఉందని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ జాప్యం జరగడానికి కారణం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఇందులో టిడిపి ప్రభుత్వం 5 ఏళ్ళు, వైసిపి ప్రభుత్వం 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాయని ఎవరు ఎక్కువ సమయం అధికారంలో ఉన్నారో తెలుసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి భూసేకరణకు సంబంధించి ఇంకనూ 20 వేలకోట్ల రూపాయలు అందించవలసిన అవసరం ఉన్నదని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అడ్వాన్స్ బిల్స్ 2 వేల 700 కోట్ల రూపాయలు ఇంతవరకూ చెల్లించామని ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవల్సి ఉన్నదని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి క్రొత్త డిపిఆర్ ఆమోద అంశం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నదని మంత్రి అన్నారు. ముంపు ప్రాంతాలను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో కలిపారని నష్టం జరిగే గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయని పోలవరం ఎత్తుతో తెలంగాణాకు ఎలాంటి నష్టం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి సిడబ్ల్యూసి, పోలవరం ప్రాజెక్ట్ ఆధారిటీతో ఎప్పటికప్పుడు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు.
గోదావరికి భారీగా వరదలు వచ్చినా ఎక్కడా ప్రాణనష్టం లేకుండా ప్రభుత్వం చూడగలిగిందన్నారు. బాధిత తక్షణ సహాయంగా రెండు వేల రూపాయలు చొప్పున అందించామని, నిత్యావసర వస్తువులు ప్రతి కుటుంబానికి ఇచ్చామన్నారు. వరదలు వచ్చి పది రోజుల తర్వాత ప్రతిపక్ష నేత చంద్ర బాబు నాయుడు బాధితులను పరామర్శించడానికి వెళుతున్నారని మంత్రి ఎద్దేవా చేసారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శ్రీ సి. నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *