-తొలుత పది జిల్లాల్లో ప్రయోగాత్మక కార్యాచరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ – 19 తర్వాత విద్యార్థుల్లో వచ్చిన అభ్యసన అంతరాలను సత్వరమే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అభ్యసన అభివృద్ధి (Learning Improvement Programme) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. యూనిసెఫ్, CIPS (Center for Innovation in Public System) , సేవ్ ది చిల్డ్రన్ మరియు గ్రామ & వార్డు సచివాలయ శాఖ వారి భాగస్వామ్యంతో పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో పై విభాగాల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలల 6,7,8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. విద్యార్థులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించి, వారిలో అభ్యసన స్థాయిలను గుర్తించి, అభివృద్ధి కోసం స్థాయిలను బట్టి అక్షరాల స్థాయి, పదాల స్థాయి, వాక్య నిర్మాణం, గణిత, సమాచార సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ మరియు అన్నమయ్య జిల్లాల్లో ముందు అమలు పరుస్తారు. జిల్లా ఛాత్రోపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్) సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు, గ్రామ- సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తదితరులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ , సిప్స్ డైరెక్టర్ సి.అచలేంద్ర రెడ్డి, సిప్స్ కార్యక్రమం నిర్వహణాధికారి డా. ఉపేంద్ర రెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల సంయుక్త సంచాలకులు వికాస్ మర్మట్ , సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి , లిప్ కార్యనిర్వహణాధికారి ప్రొఫెసర్ ఉపెందర్ రెడ్డి , యూనిసెఫ్ బాధ్యులు మురళీ కృష్ణ , సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధులు నగేశ్, ప్రశాంతి, జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు, సంబంధిత సంస్థల ప్రతినిధులు, డైట్ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.