-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ఆర్జీ సమస్యను పరిష్కరించేటప్పడు ఆర్జీదారునితో ఫోటో దిగి దానిని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో ఆర్జీదారుల నుండి స్వీకరించిన ఆర్జీలను పరిష్కరిస్తున్నప్పటికి వాటిని సరైన రీతిలో అప్లోడ్ చేయకపోవడం వలన సమస్యలను పరిష్కరించడంలో వెనుకబడుతున్నట్లు నివేదికలు దృవీకరిస్తున్నాయన్నారు. సమస్యను పరిష్కరించే సమయంలో ఆర్జీదారుని సమక్షంలో ఫోటో దిగి దానిని అప్లోడ్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్నారు. ఇకపై తప్పనిసరిగా ఫోటోలను అప్లోడ్ చేయాలని ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడటం వల్ల వారిలో తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉండి పరిష్కరించలేకపోవడం సరికాదన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, ఇతర శాఖలతో సమస్య ముడిపడి ఉండటం, ఉన్నతాధికారుల పరిధిలో పరిష్కరించవలసి ఉండటం వంటి తదితర ఆర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమస్య పరిష్కారానికి ఎదురయ్యే ఇబ్బందులను ఆర్జీదారుని దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలను అన్వేషించి పరిష్కరించినప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందన్నారు. ఈ దిశగా ప్రతీ అధికారి ఆలోచించాలన్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు వారి వారి శాఖలలో ఎన్ని సమస్యలు నమోదు అయ్యాయి వాటిని ఎన్ని పరిష్కరించగలిగారనే విషయంపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సర్వే సెటిల్మెంట్ వంటి ప్రధాన శాఖలకు సంబంధించి ఎక్కువ ఆర్జీలు నమోదు అవుతాయని ఆయా శాఖల అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి వారం ఫోటో అప్లోడ్‌పై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని అన్నారు. ఫోటో అప్లోడ్ విషయంలో అలసత్వం వహించవద్దని జిల్లా కలెక్టర్ డిల్లీరావు స్పందనలో హాజరైన జిల్లా అధికారులకు సూచించారు.
స్పందన కార్యక్రమంలో 96 ఆర్జీలు నమోదు అయ్యాయని వీటిలో రెవెన్యూ 30, పోలీస్ 9, యంఎయుడి 8, హెల్త్ 6, పంచాయతీరాజ్ 5, విద్య 4, హౌసింగ్ 4, డిఆర్‌డిఏ 4, సర్వే అండ్ సెటిల్‌మెంట్ 4, కాగా మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి 22 ఉన్నాయని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ , డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు రామలక్ష్మి, భాను, జిల్లా అధికారులు ఉన్నారు.