Breaking News

ఈ-రవాణా.. పర్యావరణ పరిరక్షణకు ఖజానా!

-గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలన్న కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా ఏపీ భారీ ముందడుగు
-రాష్ట్రాన్ని ఈ-వాహనాల కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
-ఈవీ విధానాన్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రవాణాపై ప్రత్యేక దృష్టి
-రాష్ట్రవ్యాప్తంగా 73 ప్రాంతాల్లో 400 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం
-ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు
-ఉద్యోగులు స్వచ్ఛందంగా కోరితేనే పథకం అమలు..
-త్వరలోనే జీవో జారీ చేయనున్న ప్రభుత్వం
-భవిష్యత్తు రవాణా అంతా ఈవీలదే
-ఈవీ సంబంధిత పరిశ్రమలకు అనేక రకాల ప్రోత్సాహకాలు : ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి
-ఏపీఎస్ఈసీఎంతో కలిసి ఈ-రవాణాపై నెడ్ క్యాప్ అవగాహనా కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

ఇంధన సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగ్రామి రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోంది. వివిధ రంగాల్లో ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రీన్ హౌస్ ఉద్గారాలను (జీహెచ్జీ) తగ్గించడంలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రం తాజాగా ఈ-రవాణా రంగంలోకి అడుగు పెడుతోంది. ఈ- రవాణా సమగ్ర అమలుకు కార్యాచరణ రూపొందిస్తోంది. తద్వారా రాష్ట్రాన్ని ఈ-వాహనాల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దేశంలో జీహెచ్జీ తీవ్రతను 2030 నాటికి జీడీపీలో 33-35 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా సరఫరా, డిమాండ్ వైపు అన్ని భాగస్వామ్య పక్షాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన ‘ఎలక్ట్రికల్ వెహికిల్స్ -ఈవీ’ విధానాన్ని జారీ చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఇటీవల అన్ని శాఖలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ,గ్రీన్ హౌస్ గ్యాస్ (జిహెచ్జి) ఉద్గారాలను తగ్గించడానికి అన్ని ఇంధన సామర్థ్య కార్యక్రమాలు మరియు ఇతర అనుకూల పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవలసిన తక్షణ అవసరాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. పర్యావరణ పరిరక్షణ, జీహెచ్జీ ఉద్గారాల తగ్గింపుకు సహాయపడే ఇంధన సామర్థ్య కార్యకలాపాల అమలుకు ఇంధన, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయిన శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇంధన సామర్థ్యం, పునరాత్పదక ఇంధన వనరులు, నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తు సరఫరాలో ఏపీని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలపడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని శ్రీకాంత్ చెప్పారు. తాజాగా ఈ-రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. ఈ-రవాణా వల్ల వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలు తగ్గడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. సరఫరాకు సంబంధించి.. ప్లగ్ అండ్ ప్లే, తదితర సకల సౌకర్యాలతో ఈవీ పార్కులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500 నుంచి 1000 ఎకరాల భూమిని కేటాయిస్తుందని శ్రీకాంత్ తెలిపారు. ఈవీలకు సంబంధించిన ‘ఆటో క్లస్టర్స్ అండ్ ఆటోమోటివ్ సప్లయర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్స్ (ఏఎస్ఎంఎస్)’ డెవలపర్లకు మూలధన పెట్టుబడిలో (ఫిక్స్డ్) ప్రభుత్వం 50 శాతం ఆర్థిక సాయం అందిస్తోందని వివరించారు. అలాగే ప్రైవేటు చార్జింగ్ స్టేషన్లు, హైడ్రోజన్ ఉత్పత్తి, రీ ఫ్యూయలింగ్ సదుపాయాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. డిమాండుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా ఈవీల కోసం సబ్ కేటగిరీని సృష్టించిందని.. యూనిట్ కు రూ.6.70గా టారిఫ్ ను ఖరారు చేసిందని శ్రీకాంత్ తెలిపారు. ఈవీలను ప్రోత్సహించేందుకు గాను ఎలాంటి డిమాండ్ ఛార్జీలు లేకుండా ఈ ధరను నిర్ధారించినట్లు చెప్పారు. ఏపీలో ఈఈఎస్ఎల్ ఇప్పటికే 80 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని, వివిధ ప్రభుత్వ విభాగాలకు 300 ఈ-కార్లు కూడా అందజేసిందని వివరించారు. రాష్ట్రంలోని 73 ప్రాంతాల్లో 400 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ-రవాణా వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే మరిన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకూ సిద్ధమని శ్రీకాంత్ తెలిపారు. ఐసీఈ(పర్యావరణ రహిత వాహనాలు) వాహనాల నుంచి ఈవీలకు మారే అంశం సజావుగా సాగేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 2024 కల్లా వాణిజ్య, లాజిస్టిక్ వాహనాలన్నింటినీ దశలవారీగా తొలగించేలా; 2030కల్లా అన్ని నగరాల్లో తొలగించేలా ఈవీ విధానాన్ని రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఈఎంఐల విధానంలో అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ/ ఈఈఎస్ఎల్, ఇతర సంస్థలతో కలిసి ఇందుకు నిధులు సమకూర్చనుంది. స్వచ్ఛందంగా కోరుకున్న ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో వాహనాలను అందజేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి పెట్టదు. వీసి & ఎండీ నెడ్క్యాప్ , ఎస్ రమణ రెడ్డి , ఇతర సీనియర్ అధికారులతో ఎలక్ట్రిక్ వాహనాల మీద సమీక్ష నిర్వహించిన ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ … ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 నుంచి 100 కిలోమీటర్లు తిరిగే ఈవీలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ఉద్యోగులు తమకు ఇష్టమైన వాటిని ఎంచుకోవచ్చని తెలిపారు. ఇవి వేర్వేరు బ్రాండ్లు, మోడళ్లలో అందుబాటులో ఉన్నాయని, ఈఎంఐ కూడా రూ.2000-2500 ఉంటుందని వివరించారు. ఈఎంఐ గడువు 24 నుంచి 60 నెలలు ఉంటుందన్నారు. సహకార సంఘాలు, ప్రభుత్వరంగ సంస్థలు, పింఛనుదార్లు సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీలకు ఈఎంఐ పథకం అమలును నెడ్ క్యాప్ పర్యవేక్షిస్తుందని శ్రీకాంత్ తెలిపారు. గ్రామ/ వార్డు సచివాల సిబ్బంది, ఇతర అల్పాదాయ ఉద్యోగులకు ఈ పథకం ఐచ్ఛికమేనని చెప్పారు. ఈ విషయమై త్వరలోనే జీవో విడుదల చేస్తామని వెల్లడించారు. నెడ్ క్యాప్ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి మాట్లాడుతూ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాల కంటే ఈవీలు అత్యుత్తమమైనవి. ఇంధన భద్రతతో పాటు ముడిచమురుపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయి. జీహెచ్జీ ఉద్గారాలు తగ్గడంతో పాటు గాలి నాణ్యత పెరుగుతుంది. భవిష్యత్తు రవాణా అంతా ఈవీలదే. ఈ-రవాణాను ప్రోత్సహించడం, అవగాహన పెంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ షాపులు, వెబినార్లు, రోడ్ షోలు, టెక్నికల్ టాక్స్, ఓఈఎంలతో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు నెడ్ క్యాప్ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ కు వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ ఏపీఎస్ఈసీఎం, డిస్కంలు, రవాణా, పరిశ్రమల శాఖలతో కలిసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈవీలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో సుస్థిర రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని శ్రీకాంత్ వివరించారు. ఈ-రవాణాకు ఆంధ్రప్రదేశ్ ను ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ‘ఎలక్ట్రిక్ మొబెలిటీ పాలసీ 2018-23’ని ప్రవేశపెట్టినట్లు ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. ఇ-వాహనాలను ప్రోత్సహించడానికి చాలా అనుకూలమైన మద్దతు ఇచ్చినందుకు పరిశ్రమల శాఖకు ఇంధన శాఖ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. ఈ-రవాణాకు సంబంధించిన పరిశ్రమలకు ప్రభుత్వం అనేక రకాలు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. పారిశ్రామిక యూనిట్లు, ఛార్జింగ్, బ్యాటరీ శ్వాపింగ్ స్టేషన్లకు 50 శాతం రాయితీ; ఫిక్స్డ్ విద్యుత్తు ధర, ఎలక్ట్రిక్ డ్యూటీ రీయింబర్స్ మెంట్, ప్రత్యేకంగా విద్యుత్తు సరఫరా లైన్, రాత్రిళ్లు/ నాన్ పీక్ టైంలో ఈవీ బ్యాటరీల వినియోగానికి ప్రత్యేకంగా డిస్కౌంట్లు వంటివి అందజేస్తున్నట్లు శ్రీకాంత్ వివరించారు.

 

 

Check Also

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

-అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం -లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు…కర్నూలులోనే ఉంటాయి -యువగళం హామీ మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *