– రాజమండ్రి సీటీఆర్ఐలో ఖాళీలను భర్తీ చేయండి..
– ఢిల్లీలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ ను కోరిన రాజమండ్రి ఎంపీ భరత్
రాజమండ్రి, , నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఫ్లోరీ కల్చర్ ప్రాంతీయ స్టేషను మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ న్యూ ఢిల్లీలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్ష్ పతక్ ను కోరారు. బుధవారం ఎంపీ భరత్ ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ కు అందజేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను రాజమండ్రి మీడియాకు ఢిల్లీ నుంచి ఎంపీ భరత్ తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కడియం, ఆత్రేయపురం, ఆలమూరు, మండపేట మండలాల్లో 11,500 హెక్టార్లలో నర్సరీలు విస్తరించి ఉన్నాయని, నర్సరీలపైనే ఆధారపడి దాదాపు 50 వేలమంది జీవిస్తున్నారని చెప్పారు. నూరు సంవత్సరాల చరిత్ర ఇక్కడి నర్సరీ రంగానికి ఉందని..అంతటి ప్రాధాన్యత గల నర్సరీ రైతుల అవసరాలను తీర్చడానికి ఐసీఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరీకల్చర్ రీసెర్చ్ (డీపీఆర్) ప్రాంతీయ స్టేషను ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందు కోసం 2015, నవంబరు 5న కడియం మండలం వేమగిరిలో 70.77 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా, అక్కడ సంస్థ కార్యకలాపాలకు భవనం నిర్మించింది. ఈ భవనాన్ని సీపీడబ్ల్యూడీ పునరుద్ధరించగా శాస్త్రీయ సిబ్బంది ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఫ్లోరీ కల్చర్ ప్రాంతీయ స్టేషన్ కు ప్రధాన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ భరత్ కోరారు. నర్సరీలలో వివిధ రకాల మొక్కలకు ఆశించే వ్యాధుల నివారణకు చేసే పరీక్షల కోసం ఈ ప్రయోగశాల అయిదుగురు శాస్త్రవేత్తలతో ఏర్పడిందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ ప్రయోగశాల సౌకర్యంగా లేకపోవడంతో అనుకున్న లక్ష్యాన్ని, ఫలితాలను నర్సరీ రైతులు పొందలేకపోతున్నారని అన్నారు. విశాలమైన ప్రధాన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్ష్ పతక్ ను ఎంపీ భరత్ కోరారు.