-ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తీ జక్కంపూడి రామ్మోహన రావు…
-నిస్వార్థ సేవా తత్పరుడు జక్కంపూడి రామ్మోహన రావు…
-ఇనగంటి వారి పేటలో పేద మహిళలకు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదగా 1000 మంది మహిళలకు చీరల పంపిణీ….
-ఉద్యోగమేళాలో నిరుద్యోగులకు మంత్రి చేతుల మీదగా నియమక పత్రాలు అందజేత…
-210 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
-డిప్యూటీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలలో జక్కంపూడి రామ్మోహన రావుని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నాడు జక్కంపూడి రామ్మోహన్ రావు 70 జయంతి సందర్భంగా సీతానగరం మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీతానగరం జీవీకే కన్వెన్షన్ హాలు నందు జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ మరియు వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమనికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎనగంటి వారి పేట సర్పంచ్ సత్యం రాంపండు ఆధ్వర్యంలో 1000 మంది పేద మహిళలకు మంత్రి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కొట్టు సత్య నారాయణ మాట్లాడుతూ మాకు అత్యంత ఆప్తులయిన జక్కంపూడి రామ్మోహన రావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో గెలవడం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత ప్రజల మద్దతు పొందడం మరో ఎత్తు అని,నాటి జక్కంపూడి రామ్మోహన రావు కాలంనాటి నుండి నేటి జక్కంపూడి రాజా వరకు నిరంతరం ప్రజలలో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నమ్మిన కార్యకర్తల కోసం అండగా ఆ కుటుంబం భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ఎవరికీ సాధ్యం కాని పద్ధతిలో ఎన్నో పొలిటికల్ కార్యక్రమాలు జక్కంపూడి రామ్మోహన్రావు రాష్ట్రంలో చేపట్టి తన మార్కును స్పష్టంగా కనబరిచే వారన్నారు. నమ్మిన సిద్ధాంతాలు,నమ్మిన కుటుంబం కోసం ఆఖరి శ్వాస వరకు జక్కంపూడి రామ్మోహన రావు వై.యస్ కుటుంబం తోనే ఉండడం జరిగిందన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ పేరిట జక్కంపూడి రాజా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అన్నారు. జక్కంపూడి రామ్మోహన్రావు తనయుడుగా రాజా అంటే ఎంతో అభిమానం అని,ఎమ్మెల్యే రాజా కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. రానున్న రోజులలో రాజాకు మంచి భవిష్యత్తు ఉందని,సీఎం జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి మరింత మందికి సేవలు అందించాలని మనస్పూర్తిగా భగవంతున్ని కోరుకుంటున్నా రన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.ఒక సామాన్య కార్యకర్తగా తన జీవిత ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా ఎదగడం జరిగిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నామని అందులో భాగంగానే నేడు నిర్వహించిన ఉద్యోగ మేళాలో సుమారు 500 మంది నిరుద్యోగులు పాల్గొన్నారని 210 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్యకర్తలే తమ కుటుంబానికి బలమని నేడు మేము ఈ స్థానంలో ఉండడానికి కార్యకర్తలే ప్రధాన కారణమని ఈ సభాముఖంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News