Breaking News

ఘనంగా నిర్వహించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవం

-యూనివర్సిటీ ఛాన్సిలర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ప్రదానం.
-సుదా కృష్ణమూర్తికి గౌరవ డాక్టరేట్
-సామాజిక రంగంలో పీహెచ్ డి చేసి బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి
-నందమూరి లక్ష్మీపార్వతికి నన్నయ్య యూనివర్సిటీ డి- లిట్ అత్యున్నత పట్టా అందజేత
-విద్యార్థులు తమ ప్రతిభను తమ ప్రాంత సమాజాభివృద్దికి దోహదం చేయాలని గవర్నర్ పిలుపు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వవిద్యాలయంలో మీరు పొందిన జ్ఞానం, మీరు ప్రపంచ పౌరులుగా మారడానికి సహాయం చేస్తుందని అదే సమయంలో మీ మూలాలను మరువరాదని, మీ ప్రాంతం అభివృద్దికి స్థిరమైన నిర్ణయాలతో ముందడుగు వేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఛాన్సిలర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపు నిచ్చారు.

బుధవారం రాజానగరం మండల పరిధలో ఉన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 13,14,15 వ స్నాతకోత్సవం సందర్బంగా డాక్టరేట్ గ్రహీత సుధా మూర్తి, గోల్డ్ మెడల్ సాధించిన, పిహెచ్ డీ పూర్తి చేసిన విద్యార్థులకు గోల్డమెడల్ పిహెచ్ డీ , డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. పద్మరాజు, రిజిస్ట్రార్ జి. సుధాకర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అకడమిక్ సెనేట్, అధ్యాపకులు, బోధన బోధనేతర సిబ్బంది, విశ్వవిద్యాలయ కళాశాలలు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రముఖులు అవార్డు గ్రహీతలు మరియు అతిథులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్శిటీ, భవిష్యత్తులోకి అడుగు పెట్టడానికి, మీకు సంపూర్ణమైన విద్యను అందించిందని నాకు నమ్మకం ఉందన్నారు. ఈ రోజు ఉత్తీర్ణత సాధించిన కొత్త గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. పట్టుదల మరియు కృషి కారణంగా మీరు ఈ ముఖ్యమైన మైలురాయిని సాధించారన్నారు.

“విద్య అనేది ఒక కుండను నింపడం కాని దాని యొక్క ఫలితాలను సమాజ శ్రేయస్సుకు సమర్థవంతంగా వినియోగించడంలో చూపే చతురత అని అన్నారు. మీరు సంపాదించిన జ్ఞానం సంకుచిత, మతపరమైన ఆలోచనలకు దారితీయకూడదన్నారు. జీవితంపై విస్తృత మరియు సానుభూతితో కూడిన అవగాహనకు దారితీయాలని, విశ్వవిద్యాలయంలో మీరు పొందిన జ్ఞానం, మీరు ప్రపంచ పౌరులుగా మారడానికి సహాయం చేస్తుందన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తెలుగు సాహిత్యంలో గొప్ప శాస్త్రీయ కవి నన్నయ పేరు పెట్టబడిందని, అతని కవితా దృష్టి అసమానమైనదని, స్వేచ్ఛానువాదం, మానవ సంస్కృతి అభివృద్ధిలో ఒక గొప్ప యుగంగా పేర్కొన్నారు. గొప్ప ఇతిహాసమైన మహాభారతాన్ని అనువదించే ప్రయత్నంలో, కవి ధర్మం వైపు మానవీయ విలువల యొక్క గొప్ప పరివర్తనను దృశ్యమానం చేసిన మహోన్నత వ్యక్తిగా గవర్నరు పేర్కొన్నారు.

డిగ్రీలు పూర్తి చేసిన యువ గ్రాడ్యుయేట్‌లుగా, ఈ దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన ఆదర్శాలను, మన రాజ్యాంగాన్ని,మన ప్రాచీన వారసత్వం యొక్క సార్వత్రిక విలువలను సమర్థించడం మీ కర్తవ్యమని స్పష్టం చేసారు. సత్యమే విజయం సాధిస్తుందని మీ అందరు గుర్తెరిగి భాద్యతో కూడీన పౌరులుగా అడుగు వేయాలని కోరారు. భారత దేశ సంస్కృతిలో మమేకమైన ఆధ్యాత్మిక విద్యలో మార్గదర్శకత్వం కోసం ప్రపంచం మొత్తం మన వైపు చూసి విశ్వ గురువు గా ఒక ప్రత్యేక స్థానం కల్పించడం జరుగుతోందన్నారు. యూనివర్సిటీ నుంచి డిగ్రీలు పొందిన ప్రతి విద్యార్థి క్రమ శిక్షణ కలిగి భాద్యతాయుతమైన పౌరులుగా సమాజాభివృద్ది కృషిచేయాలని పేర్కొన్నారు. జాతీయ నూతన విద్యా విధానం 2020 లక్ష్యంగా రానున్న 15 సంవత్సరాల్లో ఉన్నత విద్యలో భాగస్వామ్య రేటును రెట్టింపు చేయాలని దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్దితో కూడిన విద్యావిదానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

నేడు ప్రపంచం వాతావరణ మార్పుల పెను ముప్పును ఎదుర్కొంటోందని, పర్యావరణ కాలుష్యం గ్లోబల్ వార్మింగ్, అనూహ్య వాతావరణ మార్పులకు దారి తీస్తోందని , ఇది జీవులకు మనుగడకే హానికరంగా మారుతోందన్నారు. “ప్రతి మనిషి అవసరాలను తీర్చడానికి భూమి తగినంతగా అందిస్తుందన , కానీ ప్రతి మనిషి యొక్క దురాశతో మరింతగా ప్రయత్నించడం జరగుతోందన్నారు. సామరస్యపూర్వక జీవనానికి దారితీసే అంతరాయం కలిగించే సాంకేతికతలను మనం దృష్టిలో పెట్టుకొని వాటిని అదిగమించే దిశగా కృషిచేయాలన్నారు.

2047 నాటికి, బ్రిటీష్ వలసవాదం నుండి మన స్వాతంత్ర్యం యొక్క శతాబ్ది వేడుకలను జరుపుకుంటామన్నారు. ఇప్పటి నుండి దేశానికి స్వాతంత్య్ర శతాబ్ది సంవత్సరానికి దారితీసే కాలాన్ని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమృత్ కాల్ అని పేర్కొన్నారు. అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని మన దేశం ఎదురుచూస్తోందని, యువ విద్యార్థులుగా, విక్షిత్ భారత్@2047 యొక్క విజన్‌ను సాకారం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. మన దేశం అన్ని రంగాలలో సమానమైన మరియు న్యాయమైన సమాజంగా అభివృద్ధి చెందేలా చూడటం మీ లక్ష్యం. సమ్మిళిత అభివృద్ధి మన మార్గదర్శక తత్వశాస్త్రంగా ఉండాలనే డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆచరించాలన్నారు.

మన దృక్పథం ఎల్లప్పుడూ మన ప్రాచీన దృష్టికి అనుగుణంగా ఉండాలని “ఆనో భద్ర క్రతవోయంతు విశ్వతః” అన్ని వర్గాల నుండి జ్ఞానం రావాలని, అందువల్ల, మన నాగరికత యొక్క ప్రత్యేకతను గ్రహించి ఆమేరకు కృషి చేయాలని యువ గ్రాడ్యుయేట్‌లకు పిలుపునిస్తున్నాను. ఈ యూనివర్సిటీ రానున్న రోజుల్లో మన దేశంలోని ప్రధాన సంస్థలలో ఒకటిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేసారు. గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులందరికీ, బంగారు పతకాలు, మెరిట్ సర్టిఫికేట్‌లు గెలుచుకున్న విద్యార్థులందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకోసం ఆకాంక్షను వ్యక్తం చేసారు.

స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి, సేవామూర్తి సుధా కృష్ణమూర్తి విశ్వవిద్యాలయం నుండి ఛాన్సలర్ మరియు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డాక్టరేట్ (డి. లిట్.) అందుకున్నారు. ఈ సందర్భంగా సుధా మూర్తి మాట్లాడుతూ ఇక్కడ ఉత్తీర్ణత సాధించి బయటి ప్రపంచానికి వెళ్తున్న విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలన్నారు. విద్యార్థి స్థాయిలో రాసే పరీక్షలకు సిలబస్ , ఉపాధ్యాయులు ఉన్నారని, జీవిత పరీక్షలకు నిర్దిష్టమైన సిలబస్ లేదని పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఎదుర్కొవలసి ఉంటుందని ఆమె అన్నారు. మనకు తల్లితండ్రులు జీవన విదానాన్ని తెలియజేస్తే భవిష్యత్తులో ఎలా జీవించాలో బోధించే ఉపాధ్యాయులు అంతే కీలకమన్నారు. యువత డబ్బు వెంట పరుగెత్తడం ద్వారా నైతిక విలువలను, ధర్మాన్ని వదులుకోవద్దని ఆమె అన్నారు. అవుట్‌గోయింగ్ గ్రాడ్యుయేట్‌లు న్యాయమైన మరియు విలువ ఆధారిత మార్గంలో డబ్బు సంపాదించడానికి నిరంతరం కష్టపడాలని ఏదీ కూడా అనాయాసంగా రాదన్న విషయాన్ని గుర్తేరగాలని ఆమె సలహా ఇచ్చారు. జీవితంలో ఎదగాలంటే కష్టపడి పనిచేయడమే మార్గమని, దగ్గర దారులు ఉండవని హితవు పలికారు. జీవితమంటే వడ్డించిన విస్తరి అని కేవలం అన్నం మాత్రమే కాధని సుధామూర్తి తెలిపారు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవితాన్ని నిర్మించుకోవాలని ఆమె అన్నారు.
అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ, క్షమ, దానం, యోగం, సత్యసంపూర్ణత వంటి సద్గుణాలతో జీవించాలని చెప్పే ఉపనిషత్ శ్లోకాలను సుధా మూర్తి ఉదహరించారు.

నన్నయ వీసీ ఆచార్య కె.పద్మరాజు యూనివర్సిటీ నివేదికను వివరిస్తూ నన్నయ విశ్వవిద్యాలయంలో 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరానికి చెందిన పిహెచ్.డీ, పీజీ, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందిస్తున్నట్లు ముఖ్యఅతిధి ఛాన్సలర్ మరియు రాష్ట్ర గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్ కు నివేదిక సమర్పించారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో 13,14,15వ స్నాతకోత్సవానికి వివిధ కోర్సులకు చెందిన 500 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారని తెలిపారు. ఈ 500 మందిలో పిహెచ్.డి 12, గోల్డ్ మెడల్స్ 12, ప్రైజ్ 12, మిగిలిన వారు పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎల్.ఎల్.ఎం, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈడీ, ఎల్.ఎల్.బి., బీఈడీ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నారని ఆయన తెలిపారు. మూడు విద్యా సంవత్సరాలలో విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 8582, అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 50173 మంది విద్యార్థుల పట్టాలు ఆమోదించడం జరిగిందని పద్మరాజు వెల్లడించారు.
కార్యక్రమంలో భాగంగా యూనివర్శిటీ రిజిస్ట్రార్ జి. సుధాకర్ ముగింపు కార్యక్రమంలో భాగంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతికి ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రజానేతల జీవితాలు అనే అంశం పై పరిశోధనే చేసిందుకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డి- లిట్ అత్యున్నత పట్టాను గవర్నరు అందజేశారు. సామాజిక రంగంలో పీహెచ్ డి చేసిన సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కి బంగారు పతాకాన్ని గవర్నరు అందజేసారు.

కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి , శాసనసభ్యలు జక్కంపూడి రాజా, ఉప కులపతి ప్రొఫెసర్ కె. పద్మ రాజు,ఛైర్మన్, APSCHE ప్రొఫెసర్ కె. హేమ చంద్రా రెడ్డి, ప్రభుత్వానికి ఉమ్మడి ఆర్థిక సలహాదారు ఆర్థిక శాఖ డి. సురేంద్ర, యూనివర్శిటీ రిజిస్ట్రార్ జి. సుధాకర్ ,ఈసీ సభ్యులు,డా. పి. విజయ నిర్మల , డాక్టర్ కె. నూక రత్నం , డాక్టర్ జ్యోతి,శ్రీమతి ఎం. వసంత లక్ష్మి,డాక్టర్ షేక్ సులేమాన్ ,డా. జి. నారాయణరావు,జి. రాజ్ కుమార్,వై. సత్యనారాయణ, ప్రొ. పి. సురేష్ వర్మ, ప్రొఫెసర్ కె. ఎస్. రమేష్, డాక్టర్ వై. శ్రీనివాసరావు, ప్రొఫెసర్ జి. సుధాకర్ ,డా. డి. జ్యోతిర్మయి,డా. పి. వెంకటేశ్వరరావు , డాక్టర్ కె. సుబ్బారావు, ప్రొ. ఎస్. ప్రశాంతి , ప్రొ. టి. అశోక్,డాక్టర్ కె. రమణేశ్వరి, డా. ఎ. మట్టా రెడ్డి , డా. వి. పెర్సిస్ ,ఎస్. లింగా రెడ్డి, ప్రజాప్రతినిధులు అధికారులు, విద్యార్థులు వారి తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *