జస్టిస్ ఎవి శేష సాయి సేవలు ప్రసంశనీయం:హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎవి శేష సాయి అందించిన సేవలు ప్రసంశ నీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ఎవి శేష సాయి పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు.2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారని తెలిపారు. జస్టిస్ శేషసాయి సహనానికి పెట్టింది పేరుగా న్యాయ వ్యవస్థలో అమూల్యమైన సేవలు అందించారని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. జస్టిస్ ఎవి శేషసాయి న్యాయమూర్తిగా తన కేరీర్ లో సుమారు 23 వేల కేసులను పరిష్కరించడం జరిగిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఇంచుమించు అన్నివిభాగాల్లోను జిస్టిస్ శేషసాయి పనిచేసి మంచి సేవలందించారని కొనియాడారు.ముఖ్యంగా ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా జస్టిస్ శేష సాయి సేవలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ప్రత్యేకంగా ప్రసంశించారు.అలాగే వివిధ జాతీయ బ్యాంకుల సిబ్బందికి నైపుణ్య శిక్షణ అందించారని అన్నారు.అంతేగాక విశాఖపట్నం,రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాల్లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు.వివిధ న్యాయ కళాశాలలు,విశ్వ విద్యాలయాల్లో విద్యార్ధులకు న్యాయ పరమైన అవగాహన కల్పించేందుకు జస్టిస్ శేషసాయి కృషి చేశారని తెలిపారు.జస్టిస్ శేష సాయి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సాగాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆకాంక్షించారు.
పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయి మాట్లాడుతూ ముందుగా తన న్యాయమూర్తిగా తన కెరీర్ లో సహాయ సహాకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయ మూర్తి సహా పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు,న్యాయమూర్తులు, న్యాయవాదులు,తన ఫేషీ అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన జరిగి ఎపికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు సమయంలో తాత్కాలిక వసతుల ఏర్పాటులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు.ఆసయమంలో విజయవాడ,గుంటూరు న్యాయవాదులు అందించిన సహాయ సహకారాలను గుర్తు చేసుకుంటూ వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ దేశంలోని అత్యుత్తమ బార్ అసోసియేషన్లలో ఒకటని జస్టిస్ ఎవి శేషసాయి ఈసందర్భంగా పేర్కొన్నారు.న్యాయ మూర్తిగా తాను ఫిజికల్ గా పదవీ విరమణ చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ తన మనసంతా ఇక్కడే ఉంటుందని జస్టిస్ శేషసాయి అన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ జస్టిస్ ఎవి శేషసాయి పలు సివిల్, క్రిమినల్ చట్టాలకు సంబంధించి అనేక అంశాల్లో చురుకైన పాత్రపోషించి న్యాయ వ్యవస్థకు మంచి సేవలు అందించారని కొనియాడారు.హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం మాట్లాడుతూ జస్టిస్ శేషసాయి న్యాయమూర్తిగా అనేక అంశాల్లో కీలకమైన తీర్పులు ఇచ్చారని గుర్తు చేశారు.అంతేగాక లీగల్ అవేర్నెస్ కు సంబంధించి అనేక సెమినార్లు, సింపోజియంలు నిర్వహించి అవగాహన కల్పించారని చెప్పారు.ఎపి హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్ళు న్యాయవాదిగా,11 సంవత్సరాలు న్యాయమూర్తిగా జస్టిస్ శేషసాయి న్యాయ వ్యవస్థలో విశేషమైన సేవలు అందించారని కొనియాడారు.
అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు,రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ రావు,హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు,పలువురు ఇతర రిజిష్ట్రార్లు,సీనియనిర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *