కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఎంపీలకు ప్రధాని మోదీ కేబినెట్ లో చోటు దక్కింది. నేడు రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోదీతోపాటు వారు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, వీరికి ఏ శాఖలు కేటాయించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన రామ్మోహన్ నాయుడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకుపైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. ఇటీవలే జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యారు. తనకు కేంద్రమంత్రిగా అవకాశం దక్కడంతో నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఈక్రమంలో ఆయన ముందుగా సోము వీర్రాజు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయమంటూ శ్రీనివాస్ వర్మ ఆనంద భాష్పాలు రాల్చారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన టీడీపీ, జనసేన మద్దతుతో అనూహ్య విజయం సాధించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల ఆధిక్యం సాధించారు.

గుంటూరు ఎంపీగా తొలిసారి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్రమంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని ఎంబీబీఎస్ చదివి, పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *