-కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు సేవలందించడంలో ప్రణాళిక ప్రకారం పనిచేయాలి.
-ప్రత్యేక కంట్రోల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 12న గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామంలో ఐటీ పార్కు సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబునాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిధులకు మార్గదర్శకాలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేసి పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో లైజనింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బందితో కలెక్టర్ డిల్లీరావు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీ డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు ఏ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అతిధులకు వసతి, రవాణా తదితరాలకు సంబంధించి ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ హోటల్లకు ఇన్చార్జిలను కూడా నియమించినట్లు తెలిపారు. లైజనింగ్ అధికారులు కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై వీవీఐపీ, వీఐపీలకు అవసరమయ్యే సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమ వేదిక పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితరాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, లైజనింగ్ అధికారులు ఉన్నారు