5 ఏళ్ల తరువాత సిఎంను కలిశాం

-ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయ మీడియా ప్రతినిధుల వ్యాఖ్య
-ఇకపై మీకు సచివాలయంలో చాలా పని ఉంటుంది అంటూ మీడియా ప్రతినిధులతో సిఎం వ్యాఖ్య

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల హామీలపై తొలి సంతకాలు పెట్టారు. అనంతరం ఇంటికి వెళుతున్న చంద్రబాబు నాయుడు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపారు. కారు దిగి ముందుకు వచ్చి మీడియా ప్రతినిధులను స్వయంగా పలకరించారు. సీనియర్ రిపోర్టర్లను పేర్లతో పలకరించి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆప్యాయంగా అడిగారు. 5 ఏళ్ల తరువాత తాము సిఎంను కలిశామని….స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులు బదులిచ్చారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఉండే తాము గత 5 ఏళ్లుగా సిఎంను కనీసం కలవలేకపోయామని….పాలనా అంశాలపై కూడా మాట్లాడలేదని రిపోర్టర్లు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము 5 ఏళ్ల తరువాత సిఎంను కలిశామని నవ్వుతూ అన్నారు. ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి వారితో అన్నారు. పాలనలో సమూల మార్పు ఉంటుందని….అన్ని చోట్లా మార్పు ఉండబోతుందని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ కలుద్దాం అంటూ ఉండవల్లి నివాసానికి వెళ్లారు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *