-గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టం -1977 ను ప్రతీ ఒక్కరూ పాటించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గోవధ నిషేధ చట్టాన్ని ప్రటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. నరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా జంతు సంక్షేమ సంఘం చైర్మన్, జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధ్యక్షతన రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోవధ నిషేద చట్టం అమలుపై సొసైటీ ఫర్ ప్రివెన్షన్ అఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ ( ఎస్పీసిఏ) సమావేశాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టం- 1977 ప్రకారం గోవధ నిషేధించడమైనదన్నారు. ప్రాధమికంగా మన దేశంలో అన్ని మతాలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉంటాయని అదే సమయంలో ఇతర మతాల మనోభావాలను ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గోవధ నిషేధ పశు సంరక్షణా చట్టం – 1977 ప్రకారం పశవులను వధించేందుకు ఈ చట్టం పరిమితంగానే అనుమతిస్తుందన్నారు. గర్భందాల్చిన పశువులను, పాలు తాగే లేగదూడలను వధించరాదన్నారు. ఏదైన ఒక పశువును వధించాలంటే ఆ పశువు వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలని, వ్యవసాయ పనులకు, పునరుత్పత్తికి పనికిరాని గిత్తలకు పశువైద్యులు నిర్ధారించిన వైద్య నివేదిక తప్పనిసరిగా ఉండాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా చట్ట విరుద్ధంగా పశువులను వధించడం, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు సాధారణ పౌరులు ఇచ్చిన ఫిర్యాదులు కూడా అధికారులు స్వీకరించి విచారణ జరపవచ్చునన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ నియంత్రణకు మండల, డివిజన్ గ్రామ స్థాయిలో సంబంధిత అధికారులతో చట్టాన్ని పర్యవేక్షించేలా ప్రత్యేక బృందాలు నియమించడం జరిగిందన్నారు. పశువులను కబేళాకు తరలించే ముందు పరిశీలించి, ఫామ్- ఎ సర్టిఫికేట్ ఉంటేనే దానిని నిర్ధారించి లోపలికి అనుమతిస్తారన్నారు. దీనికి పోలీస్ శాఖకు చెందిన అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగిందన్నారు. రెవెన్యూ డివిజన్కు సంబంధించి ఆర్డినో, పోలీస్ శాఖ నుండి డిఎస్ పి, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ టీమ్ సభ్యులుగాను, మండలానికి సంబంధించి పశుసంవర్ధక, తహాశీల్దార్, స్టేషన్ ఆఫీసర్లతో కూడిన ముగ్గురు సభ్యులు టీమ్ గాను విధులు నిర్వర్తిస్తారన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్సెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ సభ్యులుగ కలిగిన టీమ్ గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టాన్ని పర్యవేక్షిస్తారన్నారు. మత సామరస్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకుని జిల్లా
యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
అనంతరం గోవధ నిషేధ పశుసంరక్షణ చట్ట- 1977 పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే పోస్టర్ను జిల్లా కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు.
సమావేశంలో మున్సిపల్ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి.వి.రమణ, ఇన్చార్జి డిపిఓ ఎన్వి .శివప్రసాద్ యాదవ్, నగరపాలక సంస్థ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, ఎస్పిసిఎ సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.