-ప్రభుత్వానికి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తాం
-స్వర్ణాంధ్ర-2047 సాధనకు తోడ్పడతాం.
-మా సేవలు వినియోగించుకోండి
-ఏపీని కోరిన ఎన్ఐఎస్‌జీ
-ఆర్టీజీఎస్‌లో ప్రభుత్వాధికారులతో సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయడానికి తాము ఎంతో ఆసక్తితో ఉన్నామని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ (ఎన్ ఐ ఎస్ జీ) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ బన్సల్ అన్నారు. ప్రభుత్వ శాఖలకు కావాల్సిన సాంకేతిక సహకారం అందివచడానికి తాము సుముఖంగా ఉన్నామన్నారు. శుక్రవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)లో ఎన్ఐఎస్‌జీ సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాజీవ్ బన్సల్ మాట్లాడుతూ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న వివిధ కార్యకలాపాల గురించి కూలంకుషంగా వివరించారు. ఆయా రాష్ట్రాలకు వారి అవసరాలను బట్టి ఈ-గవర్నెన్స్, స్ట్రాటజీ ప్లానింగ్, డిజైనింగ్ తదితర రంగాల్లో సహకారం అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలను ప్రభుత్వాలు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన సహకారం తాము అందిస్తామని చెప్పారు. తమది ఎలాంటి లాభాపేక్ష లేనటువంటి సంస్థని తెలిపారు. తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వానికి తాము కన్సల్టెన్సీ సర్వీసులు అందిస్తామన్నారు. గత రెండు దశాబ్దాలలో తమ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 30 వేల మందికిపైగా వివిధ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కల్పించామని, 200లకుపైగా ప్రాజెక్టలను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ తమ సంస్థకు మొట్టమొదటి ప్రమోటర్ గా పనిచసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంతో మరింత దృఢమైన భాగస్వామ్యం ఏర్పరచుకుని ఏపీ ప్రభుత్వంలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించాలని, ఏపీ ప్రభుత్వానికి కావాల్సిన సాంకేతిక సహకారం అందించాలని తమ సంస్థ ఎదురు చూస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా రూపొందించిన స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధానలో కూడా కావాల్సిన సాంకేతిక సహకారం అందించడానికి తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ ఐఎస్జీతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉందన్నారు. ప్రభుత్వ శాఖలు తమ కార్యకలాపాలు అమలు చేసే సందర్భంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అవసరమని, ఆ దిశగా ఈ సంస్థ సహకారం అందించాలని కోరారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే డీప్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తదిరత రంగాలపై చాలా చురుగ్గా పనిచేస్తోందని, ఈ దిశగా ఎన్ ఐఎస్టీ సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఐటీ కార్యదర్శి ఎన్. యువరాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో అమరావతిలో కూడా ఎన్ఐఎస్టీ ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే సముచితంగా ఉంటుందని సూచించగా దానికి ఆ సంస్థ ప్రతినిధుల సానుకూలంగా స్పందించారు. ఎన్ ఐ ఎస్ జీ సీఈఓ, ఆ సంస్థ ప్రతినిధుల బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ స్వాగతం పలికారు.