-ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
-ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ సంక్షేమ డైరీ ఆవిష్కరణ
-విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీతో సమావేశం
-ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకం అమలులోనూ వైసీపీ మోసం
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎంతో క్రుషి చేసిన వ్యక్తి రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025 సంక్షేమ డైరీని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి అంజలి ఘటించిన అనంతరం.. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అంబేడ్కర్ వంటి మహాన్నత వ్యక్తి స్పూర్తితో డైరీ ఆవిష్కరణలు వంటి మంచి కార్యక్రమాలు అసోసియేషన్ చేపట్టడం అభినందనీయమన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని భారతదేశం అమలు చేస్తుంటే… భారతదేశ రాజ్యాంగ స్పూర్తితో అనేక దేశాలు తమ రాజ్యాంగాలను రచించుకోవడం గొప్ప విషయమన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి పరిష్కారానికి క్రుషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వేళలా ఉద్యోగులకు సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నష్టాల ఊబిలోకి తోసి.. నాశనం చేసిందని తెలిపిన మంత్రి గొట్టిపాటి, కూటమి ప్రభుత్వ హయాంలో.. సంస్కరణల అమలుతో విద్యుత్ శాఖను మరలా గాడిలో పెడుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ వ్యవస్థ పునర్వైభవం కోసం ఉద్యోగులూ తమవంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉద్యోగులూ…. వినియోగదారులూ… గత వైసీపీ ప్రభుత్వ బాధితులే
ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యుత్ శాఖకు చెందిన పలు సమస్యలను కొందరు ఉద్యోగులు మంత్రి గొట్టిపాటి ద్రుష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి… ఉద్యోగుల అభిప్రాయం మేరకు త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)తో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలు చేశారని, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఉద్యోగస్తులకు ఆ ఇబ్బంది లేదని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ద్వారా బిల్లులు తగ్గే అవకాశం ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టని వైసీపీ ప్రభుత్వం, కరెంటు బిల్లుల పేరిట వినియోగదారులపై భారీగా విద్యుత్ భారం మోపిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందాల్సిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లోనూ వైసీపీ ప్రభుత్వం మాయ చేసి… వారిని మోసం చేసిందని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్యలను అయినా వెంటనే పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వంలో చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ అందుబాటులోకి రాలేదని, అటువంటి ప్రాంతాలకు కూడా పునరుత్పాదక విద్యుత్ ద్వారా వెలుగులు నింపుతున్నామని చెప్పారు. అటువంటి ఒక తండాలోని సుమారు 1550పైగా కుటుంబాలకు మొదటిసారి విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపిన మంత్రి గొట్టిపాటి శుక్రవారం తండాకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరీతో పాటు ఏపీ స్టేట్ బ్యాక్వార్డ్ క్లాసెస్ విద్యుత్ ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్, ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కేలండర్లతో పాటు టేబుల్ కేలండర్ ను కూడా మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రిడ్ డైరక్టర్ ఏకేవీ భాస్కర్, హెచ్ ఆర్ డైరక్టర్ పి నవీన్ గౌతమ్, వీటీపీఎస్ ఓఅండ్ఎమ్ సీఈ టి నాగరాజు, వివిధ విభాగాలకు చెందిన సీఈలు పద్మ సుజాత, శైలజతో పాటు అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్ శివకుమార్, కార్యదర్శి ఏవీ కిరణ్, డైరీ కమిటీకి చెందిన పీ సోలోమన్ రాజ్ తో పాటు పలువురు ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.