-ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 విధానం తోడ్పడుతుందన్న చంద్రబాబు
-మనం బాగుండాలి…మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి…అప్పుడే నిజమైన పండుగ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
-జన్మభూమి స్ఫూర్తితో పీ4 విధానంలో భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారికి ముఖ్యమంత్రి పిలుపు
-పీ4 అమలుకు సంక్రాంతి పండుగ వేదికగా తొలి అడుగు పడాలని ఆకాంక్షిస్తూ పీ4 విధానంపై ప్రకటన
-ప్రజలనుంచి సూచనలు, సలహాలు, అనుభవాలు స్వీకరిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-ప్రతి ఒక్కరి సంకల్పంతో జీరో పావర్టీ- P4 విధానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. ఉన్నతమైన మన సంస్కృతీ సాంప్రదాయాలు వర్ధిల్లాలి. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలి.
మనం బాగుండాలి…మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి. అప్పుడే నిజమైన పండుగ. ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనతో ప్రజల జీవితాల్లో వెలుగు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. పది సూత్రాలతో స్వర్ణాంధ్ర -2047 విజన్ ను ఆవిష్కరించాం. ఇందులోని పది సూత్రాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేసేందుకు అడుగులు వేస్తున్నాం. వీటిలో ప్రధమ సూత్రం జీరో పావర్టీ. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించిందే P4 విధానం (పబ్లిక్ -ప్రైవేటు- పీపుల్-పార్టనర్షిప్).
ఉమ్మడి రాష్టంలో 1995లో అమలు చేసిన సంస్కరణలు, తెచ్చిన పాలసీలతో కోట్లాది మంది ప్రజల జీవితాలు మారాయి. ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా నాడు తీసుకువచ్చిన P3 (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానంతో ఉపాధి, సంపద సృష్టి జరిగింది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు సైతం నాటి అవకాశాలతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అనేక వర్గాల వారు దేశ, విదేశాల్లో మంచి స్థానాలకు చేరుకున్నారు. గ్లోబల్ సిటిజన్స్ గా వెళ్లి…నేడు గ్లోబల్ లీడర్స్ అవుతున్నారు. అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజల సత్తా చాటుతున్నారు.
నాటి సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేర్చాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ లక్షల కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం నేటికీ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతో మంది కటిక పేదరికంలోనే ఉన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు, సమాజాన్ని శక్తివంతంగా చేసేందుకు పీ4 విధానాన్ని ప్రతిపాదించి నేడు విధాన పత్రాన్ని ఆవిష్కరిస్తున్నాను. తమ శక్తి యుక్తులతో, ప్రభుత్వ పాలసీతో సమాజంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10 శాతం మంది ప్రజలు…అట్టడుగున ఉన్న 20 శాతం మంది ప్రజలకు చేయూతనిచ్చి పైకి తేవాలని కోరుతున్నాను. పేద వర్గాల చదువులకు, ఉపాధి అవకాశాలకు, నైపుణ్యం పెంచేందుకు ఒక పద్ధతి ప్రకారం చేయూతనిస్తే వారి కుటుంబాలు నిలబడతాయి.
సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవసరమైన నాలెడ్జ్, సాంకేతికతను అందించి మార్గ నిర్దేశనం చేసి వారి జీవితాల్లో వెలుగులు తేవచ్చు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృ భూమిలో ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక సమూహానికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో చేయూతను అందించి వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చు.
సమాజంలో తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని ఆయా రంగాల్లో అగ్రస్ధానాల్లో ఉన్నారు. అలాంటి వాళ్లు సమాజానికి తమవంతు తిరిగి ఇచ్చేందుకు ఆలోచనలు అమలు చేయాలి. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్లు, ఎన్ఆర్ఐలు తమకు తెలిసిన పేదలకు మెంటర్‌గా ఉండడం, అవకాశాలు కల్పించడం, అండగా ఉండడం ద్వారా సమాజంలో పెనుమార్పులు తీసుకురావచ్చు. నాడు జన్మభూమి స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు గ్రామాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చాయి. నాడు ఇచ్చిన పిలుపుతో ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అనేక గ్రామాల రూపురేఖలు మార్చారు. నేడు అదే స్ఫూర్తితో అట్టడుగున ఉన్న పేదలకు అవకాశాలు కల్పించి వారిని పైకి తెచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను.
పేదరికం లేని సమాజం మా నినాదం, మా విధానం. ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపడం మా లక్ష్యం. ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. రాష్ట్ర ప్రజలతో పాటు పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన ప్రతి ఒక్కరు దీనిపై చర్చించాలని కోరుతున్నాను. పొరుగువారికి సాయం చేయడం ద్వారా మీరు సాధించిన విజయానికి సార్థకత చేకూరుతుంది. పీ4 విధానంపై ప్రతి ఒక్కరి సలహాలు, అనుభవాలు, ఆలోచనలు, సూచనలు తీసుకునేందుకు మేం సిద్దంగా ఉన్నాం. దీని కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకువచ్చి 30 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఆలోచనలు స్వీకరిస్తాం. ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ లక్ష్యాన్ని చేరుకుందాం. తెలుగు జాతిని నెంబర్ 1 చేసే క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై కలిసి రావాలని ప్రజలను వినమ్రంగా కోరుతున్నాను.
పేదల జీవితాలు మార్చే కార్యక్రమంలో నేను సైతం అని ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా సంక్రాంతి రోజున సంకల్పం తీసుకోవాలని కోరుతున్నాను. తద్వారా ఆరోగ్య, ఆనంద, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌ను సాధిద్ధాం.