-గొల్లపూడి లో ఘనంగా భోగి వేడుకలు
-వేడుకలకి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని హాజరు
-బోగి మంటలు వెలిగించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వసంత
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్లలో రాష్ట్రంలో కనిపించని సంక్రాంతి శోభ ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలో కనిపిస్తుందని…గ్రామీణా ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సంక్రాంతి శోభ వెల్లివిరిస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఇబ్రహీం పట్నం మండలం గొల్లపూడి వన్ సెంటర్ లో సోమవారం ఉదయం తెల్లవారుజూమున నిర్వహించిన భోగి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ తో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సతీసమేతంగా పాల్గొన్నారు.
ముందుగా టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాంప్రదాయబద్దంగా పూజ కార్యక్రమాల్లో పాల్గొని భోగి మంటలు వెలిగించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట నృత్యాలు, గంగిరెద్దు విన్యాసాలు ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ భోగి పండుగ ప్రజలకు భోగ భాగ్యాలను అందించి సంక్రాంతి వారి జీవితాల్లో కోత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు ప్రజలు సొంత ఊర్లకు వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి రాష్ట్రానికి తరలిరావటం ఎంతో సంతోషంగా వుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో రైతులకి రైతుబంధు పథకం ప్రారంభించనున్నారని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాభివృద్ది, రైతుల సంక్షేమం, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది దిశగా పయనిస్తుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం కలిగే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుండటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నాటికి మరింత ప్రగతి సాధిస్తామన్నారు.
ఈకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీతారామయ్య, టిడిపి సీనియర్ నాయకులు గూడపాటి పద్మశేఖర్ లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.