రాష్ట్రంలో ఎక్కడా పండుగ వాతావరణం లేదు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి సంబరాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున బీసెంట్ రోడ్డులో భోగి వేడుకలను మల్లాది విష్ణు ప్రారంభించారు. యువత, మహిళలు కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ కష్టాలు, బాధల్ని అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ సుఖసంతోషాలు ప్రసాదించాలని.. భోగి మంటల చుట్టూ తిరుగుతూ తమ ఆనందాల్ని పంచుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏటా బీసెంట్ రోడ్డులో భోగి వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కానీ ఏ ఏడాది నగరంలో ఎక్కడా పండుగ కళ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు, రవాణా, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు జీవించే పరిస్థితి లేదన్నారు. అదే వైసీపీ ప్రభుత్వంలో ఏటా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి మరీ.. చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేసినట్లు గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి మించి సంక్షేమం అమలు చేస్తామని మభ్యపెట్టిన కూటమి పాలకులు.. తీరా అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కుతున్నారని మండిపడ్డారు. ‘సంక్రాంతి’ అనేది ముఖ్యంగా రైతన్నల పండుగ అని.. కష్టించి పండించిన పంట సిరి చేతికొచ్చిన ఆనందంలో కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో అన్నదాతలు ఈ పండుగను జరుపుకుంటారని మల్లాది విష్ణు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో మద్ధతు ధర, పెట్టుబడి సాయం లభించక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కాదా..? సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 7 మాసాలవుతున్నా.. ఇంతవరకు ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదని మల్లాది విష్ణు విమర్శించారు. తల్లికి వందనం, రైతులకు రూ. 20 వేలు వంటి పథకాలు ఇవ్వకపోవడంతో ప్రజల చేతిలో చిల్లి గవ్వ లేదన్నారు. అదే వైఎస్సార్ సీపీ అధికారంలోకి ఉండగా.. పండగ సమయానికి ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ అయ్యేవని.. దీంతో ప్రజలు ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను జరుపుకునే వారని పేర్కొన్నారు. అలాగే గత ఏడాది ఇదే సమయానికి రైతన్నలకు ఖరీఫ్ పంట డబ్బులు చేతికొచ్చాయని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో పండుగ చేసుకుంటున్నామన్న పేరే గాని.. రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా ఏ ఒక్కరిలో సంతోషం లేదన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపర్చే కార్యక్రమాలను చేపట్టడంలోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏ విధంగా వస్తుందని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్నికల హామీలను నెరవేర్చాలని.. ప్రజలపై వేసిన భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, అంజిబాబు, యరగొర్ల శ్రీరాములు, మురళీకృష్ణంరాజు, కొండా మహేశ్వర్ రెడ్డి, కోలా నాగాంజనేయులు, తోపుల వరలక్ష్మి, త్రివేణి రెడ్డి, యక్కల మారుతీ, కగ్గా పాండు, ఫాతిమా, వీరబాబు, జగదీష్, బంకా బాబీ, ప్రసాద్ రెడ్డి, గజ్జలకొండ వాసు, మీసాల సత్యనారాయణ, ప్రేమ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *