-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే రైతులకు, కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేసి పెట్టుబడి సాయం అందజేయాలని బుధవారం జరిగిన రైతుసంఘ రాష్ట్ర సమితి సమావేశం తీర్మానించినట్లు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో తెలిపారు.
పంట సాగుదారులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పెంచి 5 లక్షల వరకు పంట రుణాలు అందించాలని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రూ॥ 2 లక్షల వరకు ఎటువంటి హామీ లేకుండా కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, కౌలు రైతుల రక్షణ మరియు సంక్షేమానికి నూతన కౌలు చట్టం తీసుకురావాలని తదితర డిమాండ్లతో జూన్ 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలించి సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని మద్దతు ధరలు పెంచాలని అత్యధికంగా సాగు చేసే వరి పంటకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. క్వింటా ధాన్యానికి కేవలం రూ॥ 69 ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుందన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం సీ2G50శాతం కలిపి రూ॥ 3,135లు ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో 70 నుంచి 80% కౌలు రైతులే పంటలు పండిస్తున్నారని, భూ యజమాని ప్రమేయం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు తక్షణమే జారీ చేయాలని, భూమిలేని కౌలురైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేయాలని సమావేశం తీర్మానం చేసిందన్నారు. జూన్ 12,13, 14 తేదీలలో రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి అవసరమైన నిధులకోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పర్యటనలు చేయనున్నట్లు తెలిపారు. ముడి ఆయిల్ పై కేంద్ర ప్రభుత్వం 27.5% ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతానికి తగ్గించారని దీనివల్ల ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. సుంకాన్ని 40% పెంచాలని వారు డిమాండు చేశారు.
పోలవరం బనకచర్ల ఎత్తిపోతల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పున పరిశీలించాలని, హంద్రీనీవా కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేసి కాల్వ వెడల్పు చేసే పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల ఆదాయాన్ని పెంచడానికి, సాగును ప్రోత్సహించడానికి, గిట్టుబాటు ధరల సాధనే లక్ష్యంగా మిర్చి, మామిడి, అరటి, జీడిమామిడి తదితర పంటలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఫ్రూట్ జ్యూస్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం జీఎస్టీ వెంటనే ఎత్తివేయాలని జి. ఈశ్వరయ్య, కె.వి.వి. ప్రసాద్‌లు డిమాండ్ చేశారు.
మద్దతు ధరలపై పున: సమీక్షించాలి :` కేంద్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా ప్రకటించిన మద్దతు ధరలను పున: సమీక్షించి డా॥ యం.యస్. స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటిస్తూ చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర సమితి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అఖిల భారత కిసాన్‌సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య డిమాండు చేశారు. 14 పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం విధానాలతో రైతుల ఆధాయం ఏ మాత్రం పెరగదని స్వామినాధన్ సిఫార్సులు లక్ష్యంగా మద్దతు ధరలు ప్రకటించే ముందు యస్.కె.యం. నాయకత్వంలోని రైతు సంఘాలతో చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ. కాటమయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కె.జగన్నాథం, మల్నీడీ యల్లమందారావు, ఎ. రామానాయుడు, వి. హనుమారెడ్డి, బుడితి అప్పలనాయుడు, రాష్ట్ర సమితి సభ్యులు యం.రాజేంద్రప్రసాద్‌పలు జిల్లాల రైతుసంఘ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News