Breaking News

ఇళ్లు కట్టాలి… ఇళ్ల స్థలాలు ఇవ్వాలి… క్రమబద్దీకరించాలి

-ప్రజలకు విద్య, వైద్యం, విద్యుత్ భారాలు తగ్గాలి
-జాతీయ, అంతర్జాతీయ విద్యకు పావల వడ్డీ రుణాలు
-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలన్నీ బుడగజంగాలకు కల్పించండి
-రూరల్ ఆటోనగర్‌ల ఏర్పాటుపై దృష్టి సారించండి
-అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండ్ రావాలి
-పేదల సంక్షేమం కోసమే సమీక్షలు… సమావేశాలు
-7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
సంతృప్త స్థాయిలో అందరికీ ఇళ్లు ఇవ్వాలని… అవసరమైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్దీకరించడం వంటి అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2027 చివరి నాటికి రీ-సర్వే పూర్తి చేయడంతోపాటు… 22ఏ భూముల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండో రోజున సీఎం చంద్రబాబు సంక్షేమ శాఖలు, రెవెన్యూ, హౌసింగ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఆగస్టు 15లోగా 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. డిసెంబర్ నాటికల్లా మరో 2.38 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. 2027 డిసెంబర్ నాటికి మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 2 లక్షల మందికి ఇంటి జాగాలు అవసరం అవుతాయని అంచనా. 3 సెంట్లు గ్రామాల్లో, 2 సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది. లబ్దిదారులు అంగీకరిస్తే… ప్రస్తుతం ఉన్న వారికి అదే లే అవుట్లల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇబ్బందులు లేని చోట భూసేకరణ, సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్దీకరించాలి. ఇళ్ల క్రమబద్దీకరణలో ఏమైనా ఇబ్బందులు వస్తే కెబినెట్ కు పంపాలి… మేం ఆమోదిస్తాం. ఇళ్ల క్రమబద్దీకరణ పూర్తి చేయగలిగితే… విజయవాడలో 60 వేల మందికి, విశాఖలో 30 వేల మందికి లబ్ది చేకూరుతుంది. గుంటూరులో 22ఏ భూముల సమస్యలను పరిష్కరించాలి. వచ్చే కలెక్టర్ల సమావేశంలోగా 22ఏ పెండింగ్ ఉండకూడదు. భూవివాదాల్లో అతిపెద్ద లిటిగెంట్ రెవెన్యూ విభాగమే. 4 లక్షలకు పైగా భూవివాదాల కేసులు పెండింగులో ఉన్నాయి. ఖాళీగా ఉన్న డీఆర్వోలు, ఆర్డీవోల స్థానాలకు త్వరలో పోస్టింగ్స్ ఇస్తాం. జిల్లా కార్యాలయాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడదాం. రీసర్వే ప్రక్రియను 2027 మార్చిలోగా పూర్తి చేయాలి… పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ కావాలి.“అని సీఎం ఆదేశించారు.

కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు

“బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్ ఉంది… దీనిపై కేంద్రంతో మాట్లాడతాం. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తింప చేసే ప్రతి ప్రయోజనాన్ని బుడగజంగాలకు వర్తింప చేయాలి. రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయడానికి ఓ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశాం. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతాం. బీసీ హాస్టళ్లల్లో ఆర్వో యూనిట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం… హాస్టళ్లకు మరమ్మత్తులు చేపట్టాం. ముస్లిం జనాభా ఉన్న చోట 175 నియోజకవర్గాల్లోనూ రూరల్ ఆటోనగర్ లు ఏర్పాటు చేస్తే ఓ పారిశ్రామిక వాడ సిద్ధం అవుతుంది. వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఈ పారిశ్రామికవాడలను మైనారిటీల కోసమే ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి… జీవనోపాధి హబ్‌లుగా వీటిని అభివృద్ధి చేయాలి. జలధార, పశుగ్రాసం సహా వివిధ కార్యక్రమాలను కేంద్ర పథకాలతో ఇంటిగ్రేట్ చేసి అమలు చేయాలి. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేలా అధికారులు కృషి చేయాలి. విద్య, వైద్యం, విద్యుత్ ఖర్చుల నుంచి ప్రజలకు ఊరట కలిగించేలా అధికారులు చొరవ చూపాలి. ప్రభుత్వ పథకాలు.. ప్రభుత్వ చేపట్టే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు లబ్ది కలుగుతుందనే అవగాహన పెంచాలి. కలెక్టర్ల సమావేశాలు… సమీక్షలు… గంటల తరబడి మీటింగులు అన్నీ ప్రజల కోసమేననే అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పేద, మధ్య తరగతి, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐటీ లాంటి ప్రఖ్యాత సంస్థల్లో బడుగులకు, పేదలకు సీట్లు దక్కించుకునేలా పని చేయాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు అందరికీ సమన్యాయం జరగాలి. అన్ని వర్గాల యువతకూ నైపుణ్యాభివృద్ధి జరగాలి. 11 లక్షల మందికి పైగా కుటుంబాలను పీ4 కింద అడాప్ట్ చేసుకున్నాం. విద్యతో పాటు ఆర్ధిక చేయూత, ఉపాధి ఉద్యోగం లాంటి అంశాలతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. 10-20 ఫార్ములాతో పీ4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మన రాష్ట్రానికి సౌర విద్యుత్ ఓ గేమ్ చేంజర్, ఎస్సీ,ఎస్టీలు, బీసీలకు రాయితీపై సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. ప్రజలకు విద్య కోసం పెడుతున్న ఖర్చు తగ్గించాలి. విద్యా శాఖ ఇటీవల కాలంలో చక్కగా పని చేస్తోంది… ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరిగాయి. ప్రజలు వైద్యంపై పెట్టే ఖర్చును కూడా గణనీయంగా తగ్గించాలి. మెరుగైన వైద్యం అందించాలి. విద్యుత్ ఛార్జీలు తగ్గేలా చేస్తే పేదవారికి మెరుగ్గా ప్రయోజనాలు అందుతాయి. సంక్షేమం, సాధికారిత అనేది నిరంతర కార్యక్రమంగా కొనసాగాలి. జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన తాగునీరు, వ్యర్ధాల నిర్వహణ, గ్యాస్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లుతో క్లీన్ విలేజ్ గా తీర్చిదిద్దాలి. ప్రజల జీవనప్రమాణాలు పెంచేలా చర్యలు చేపడుతున్నాం. కుటుంబ అవసరాలు, సామాజిక అవసరాలు తీరితే సుస్థిరాభివృద్ధి దిశగా ముందుకు వెళ్దాం.”అని సీఎం వివరించారు.

ప్రభుత్వ లక్ష్యం… ప్రజల సంక్షేమం

“నిర్దుష్టమైన తేదీల్లో దీపం-2.0 కింద ఇచ్చే సబ్సీడీ డబ్బులు లబ్దిదారులకు ఇచ్చేలా చూడాలి. దీపం-2.0 పథకానికి ఇప్పటి వరకు రూ.3,504 కోట్లు మేర ఖర్చు అయ్యింది. దీపం-2.0 పథకం కింద 1.08 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. స్త్రీశక్తి కింద ఇప్పటి వరకు 60.6 కోట్ల ప్రయాణాలు చేశారు. ఏడాదికి రూ. 1940 కోట్లను స్త్రీ శక్తికి ఖర్చు పెడుతున్నాం. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మందికి రూ.10 వేల కోట్ల ఇస్తున్నాం. మే 19వ తేదీన మత్స్యకారుల సేవలో కార్యక్రమం రూ.286 కోట్ల మేర లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నాం. హాస్టళ్లల్లో ఏదీ వృధా కాకుండా చూడాలి. నెట్ జీరో విధానాన్ని హాస్టళ్లకు వర్తింప చేయాలి. హాస్టళ్ల కిచెన్ల నుంచి వ్యర్థాలను సర్కులర్ ఎకానమీకి అనుసంధానం చేయాలి.. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ లు ఏర్పాటు చేయాలి. కిచెన్, ఫ్రూట్ గార్డెన్లు వచ్చేలా చూడాలి. గిరిజన, ఎస్సీ సంక్షేమ శాఖలో చదువుతున్న విద్యార్ధులు ఐఐటీ ర్యాంకులు సాధించేలా శిక్షణ ఇవ్వాలి. పావలా వడ్డీకే జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో చదువుకునేలా విద్యారుణం ఇప్పించేలా కార్యాచరణ చేపట్టాలి. విదేశాల్లో ఉద్యోగాలు దక్కించుకునేలా ఎస్సీ,ఎస్టీ యువతకు జర్మన్ భాష నేర్పిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో కాఫీ, పసుపు, కుంకుమపువ్వు సాగును చేపడుతున్నాం… వ్యాల్యూ అడిషన్ వచ్చేలా ప్రాసెసింగ్ ప్రక్రియ చేపట్టాలి. నేచురల్ ఫార్మింగ్, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ లాంటి ప్రక్రియలు కూడా చేపట్టాలి. అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా మారేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి… వీటికి పర్యాటక ప్రాజెక్టులను లింక్ చేయాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు

-ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్ ద్వారా నిర్వహణ భాద్యతలు -ఇప్పటికే కూటమి పాలనలో 12 కేంద్రాలు ఏర్పాటు -వైద్య ఆరోగ్య శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *