Breaking News

షరతులులేని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి…

-జనగణన, డీ లిమిటేషన్‌తో మోదీ మాయాజాలం
-బీజేపీ ఓట్ల లబ్ది రాజకీయాలు
-మారుమ్రోగిన ‘మహిళా సంఘాల ఐక్యవేదిక 2కే వాక్’
-కేంద్ర మోసపూరిత విధానాలపై మహిళా నేతల ధ్వజం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనగణన, డీలిమిటేషన్ వంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే వాక్ మారుమ్రోగింది. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్‌రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు మహిళా నాయకులు, మహిళలు భారీ ప్రదర్శనగా తరలివచ్చి..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మహిళా వ్యతిరేక విధానాలపై తూర్పారబట్టారు. మహిళలు అడుగడుగునా కదం తొక్కుతూ, వారి హక్కుల పరిరక్షణ కోసం గళమెత్తారు. మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక కాలయాపనకు పాల్పడుతోందని, జనగణన, డీలిమిటేషన్‌లకు బిల్లును ముడిపెట్టి మహిళల రాజ్యాంగబద్ధ హక్కులను అణచివేసే కుట్ర సాగుతోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మహిళా సాధికారత పేరుతో మాయమాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం, అమలు విషయంలో మాత్రం మోసపూరిత రాజకీయాలకు దిగుతోందని ధ్వజమెత్తారు. అనంతరం ఏపీ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. దుర్గాభవానీ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న చిత్తశుద్ధి పాలక వర్గాలకు లేదని మండిపడ్డారు. మూడు దశాబ్దాలుగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు మహిళా రిజర్వేషన్ల కోసం నిరంతర పోరాటాలు సాగిస్తున్నప్పటికీ, ప్రతి దఫా ఏదో ఒక సాకుతో బిల్లును అడ్డుకుంటూ వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకోసం మహిళలు రక్తంతో లేఖలు రాసిన సంఘటనలు సైతం ఈ దేశ చరిత్రలో నమోదయ్యాయని గుర్తుచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును..జనగణన, డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం ద్వారా, అది అమలు కాకుండా చేయడమే అసలు ఉద్దేశమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రచారం చేసుకుంటూనే, దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్లీ కొత్త షరతులతో ముందుకు తేవడం మహిళలను మోసగించడమేనని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలనే కుట్రపూరిత రాజకీయాల భాగంగానే డీలిమిటేషన్‌ను ముందుకు తెచ్చారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణన, డీలిమిటేషన్ వంటి అడ్డంకులు లేకుండా మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్‌మోహన్‌రెడ్డి వంటి నాయకులు మహిళా రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తూ, మోదీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ మహిళా సమస్యలపై మౌనం పాటిస్తూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
ఐద్వా జాతీయ నాయకురాలు డి.రమాదేవి మాట్లాడుతూ 2010లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును పక్కనపెట్టి మళ్లీ కొత్త షరతులతో ముందుకు రావడం మహిళల హక్కులను హరించడమేనని అన్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోయినా, మహిళా రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికే ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయకుండా వాయిదా వేయడం మహిళా సాధికారతను హత్య చేయడమేనని అన్నారు. పార్లమెంట్‌లో తగిన మెజారిటీ లేదని తెలిసినా సవరణ బిల్లును తీసుకురావడం వెనుక బీజేపీ రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్‌లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తోందని విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నప్పటికీ నిందితులను కాపాడే ధోరణిని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు. మహిళలను అడుగడుగునా అవమానిస్తున్న ఎన్డీఏ కూటమి దేశ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన రాజకీయ నాటకాన్ని దేశ ప్రజలు స్పష్టంగా గమనించారని, ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళల భావోద్వేగాలను వినియోగించుకుని ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అత్రాస్, ఉన్నావ్, బిల్కిస్ బానో వంటి ఘటనల్లో మహిళలకు న్యాయం చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని బీజేపీ ప్రయత్నించిందని విమర్శించారు. డీలిమిటేషన్‌ను అడ్డంపెట్టుకుని మహిళా రిజర్వేషన్ల అమలును నిరవధికంగా వాయిదా వేయాలనే కుట్రను ఇండియా కూటమి బహిర్గతం చేసిందన్నారు.

2కే రన్‌ను మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రారంభించి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల అమలుపై మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని విమర్శించారు. జనగణన, డీలిమిటేషన్‌లకు మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టి అమలు కాకుండా అడ్డంకులు సృష్టించడం బీజేపీ రాజకీయ స్వలాభ కుట్రలో భాగమని మండిపడ్డారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ మహిళల పట్ల నిజమైన గౌరవం ఉంటే ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐప్వా రాష్ట్ర కార్యదర్శి నాగమణి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాధ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, కేవీపీఎస్ నాయకుడు ఆండ్ర మాల్యాద్రి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రి అధ్యక్షత వహించగా, శ్రామిక మహిళా పోరం నుంచి ధనలక్ష్మి, ఏఐటీయూసీ నుంచి కొట్టు రమణ, సీఐటీయూ నుంచి సుబ్బారావమ్మ, జనవిజ్ఞాన వేదిక నుంచి లక్ష్మణరెడ్డి, జర్నలిస్టు వై.శాంతి, ఓర్సు భారతి, బంక ఝాన్సీ, దుర్గాసి రవణమ్మ, డి. సీతారావమ్మ, పి.రాణి, ఆర్.ఉమ, బి.శాంత, నాగూర్బీహు, అనితా షైనీ, కాజ శ్రీదేవి, కాట్రగడ్డ స్వరూపరాణి, పిన్నమనేని విజయ, కొరగంజి దుర్గాంబ, సంధ్య, గడ్డం ఝాన్సీ, దుర్గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ వందన సమర్పణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *