-ఇసుక అక్రమాలను నిరోధించి సక్రమంగా అందించాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంలో పలు అక్రమాలు, దందాలు చోటుచేసుకుంటూ ‘ఉచిత ఇసుక ఉత్తిమాటగా’ మిగిలిపోతోందని, ఇసుక అక్రమాలను నిరోధించి సక్రమంగా వినియోగదారులకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక’ విధానం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తోంది. ఉచిత ఇసుక ఉత్తిమాటగా మిగిలిపోతోంది. భవన నిర్మాణ రంగానికి ఊతమివ్వాలని, పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ పాలసీ, ఆచరణలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఉచితం అని ప్రకటిస్తున్నా, వినియోగదారుడికి మాత్రం ఇసుక భారం తగ్గకపోగా, బ్లాక్ మార్కెట్ దందా, ఇసుక మాఫియా కారణంగా జేబులు ఖాళీకాక తప్పడంలేదు.
ప్రస్తుతం ఇసుక రీచ్‌ల వద్ద “ఉచితం” అనే మాట కేవలం బోర్డులకే పరిమితమైంది. ఒక ట్రాక్టర్ లేదా ట్రక్కు ఇసుక కావాలంటే ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు ఛార్జీల కంటే 5 నుంచి 10 రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇసుక ట్రక్కు ధర ఏకంగా రూ.5 వేల నుండి రూ.10 వేల వరకు పలుకుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. సీనరేజ్ ఛార్జీలు, లోడింగ్ ఖర్చులు మరియు రవాణా ఛార్జీల పేరుతో మధ్యవర్తులు, లారీ యజమానులు ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అనధికారిక మార్గాల్లో ఇసుక తరలిపోతోంది. చాలా ప్రాంతాల్లో “విచ్చలవిడిగా ఇసుక అమ్మబడును” అనే బోర్డులు బహిరంగంగానే కనిపిస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు అధికారికంగా బుక్ చేసుకుందామని వెళ్తే మాత్రం “స్టాక్ లేదు” లేదా “సర్వర్ సమస్య” అనే సమాధానాలు ఎదురవుతున్నాయి. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన ప్రభుత్వ సాయం మధ్యలోనే ఆగిపోతోంది.
ఇసుక కష్టాలు భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇసుక కొరత మరియు అధిక ధరల వల్ల సామాన్యులు తమ ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. మేస్త్రీలు, కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇసుకపై వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకున్నప్పటికీ, ఆ ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరకపోవడం విచారకరం. అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ జోక్యం వల్లనే ఇసుక అక్రమాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం.
ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావాలంటే కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కఠినమైన పర్యవేక్షణ ఉండాలి. ఇసుక మాఫియాను, అక్రమ దందాను నివారించాలి. రవాణా ఖర్చులను క్రమబద్ధీకరించడంతోపాటు, దళారుల ప్రమేయం లేకుండా టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకమైన బుకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంకాకుండా ఇసుక అందించగలిగినప్ప్పుడే ‘ఉచిత ఇసుక’ పథకం ఆశయం నెరవేరుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం నిర్ధిష్ట చర్యలు చేపట్టాని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.
Prajavartha Online Telugu News