Breaking News

పబ్లిక్ పార్టిసిపేషన్ తో పాటు పబ్లిక్ ట్రస్ట్ కూడా ముఖ్యం – హోం మంత్రి వంగలపూడి అనిత

-7వ కలెక్టర్ల సదస్సులో సింగపూర్ పర్యటన అనుభవాలు పంచుకున్న హోం మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన 7వ కలెక్టర్ల సదస్సులో గురువారం హోం మంత్రి  వంగలపూడి అనిత SAGE కార్యక్రమం కింద చేసిన సింగపూర్ పర్యటన అనుభవాలను సభతో పంచుకున్నారు. ఆ పర్యటనను కొందరు ఎంజాయిమెంట్ ట్రిప్ అని పిలిచారని, కానీ అది వాస్తవానికి దూరమైన మాటని ఆమె స్పష్టం చేశారు. విమానం 4 గంటలకు ఉంటే తాము 2 గంటలకే క్లాస్‌రూమ్‌లో కూర్చున్నామని, ఒక్క రోజు కూడా విశ్రాంతిగా గడపలేదని ఆమె చెప్పారు. ప్రతి క్షణం నేర్చుకోవడానికే వినియోగించామని ఆమె స్పష్టం చేశారు.

సింగపూర్ అంతటా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత కనిపించిందని మంత్రి అన్నారు. ఎక్కడికి వెళ్ళినా సీఎం గారి నీడ కనపడుతూనే ఉందని, సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. 1996లోనే ముఖ్యమంత్రి జన్మభూమి కమిటీల ద్వారా పబ్లిక్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడారని, ప్రజలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలనే ఆలోచన అప్పటి నుంచే ఆయనకు ఉందని ఆమె గుర్తు చేశారు.

అయితే సింగపూర్ పబ్లిక్ పార్టిసిపేషన్‌కు మించి పబ్లిక్ ట్రస్ట్ మీద దృష్టి పెట్టిందని మంత్రి వివరించారు. అక్కడ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ చాలా బలంగా ఉందని, ఏదైనా పథకం తీసుకొచ్చే ముందే ప్రజలకు చెప్పి సిద్ధం చేస్తారని ఆమె తెలిపారు. జరగబోయే మార్పులను ముందే అర్థమయ్యేలా చేయడం వల్ల ప్రజలు వ్యతిరేకించకుండా సహకరిస్తారని ఆమె అన్నారు. ప్రభుత్వం ఏదైనా చేయాలంటే ముందు ప్రజల నమ్మకం సంపాదించాలని, అది రాత్రికి రాత్రి సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

సహజ వనరులు లేకుండా కూడా అన్నీ సొంతంగా సృష్టించుకుని సింగపూర్ ఎదిగిన తీరు అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉందని మంత్రి అన్నారు. నీళ్ళు కూడా శుద్ధి చేసుకుని తాగే దేశం ఇంత ఎత్తుకు ఎదిగిందంటే… వనరులు ఉన్న మన రాష్ట్రం ఎందుకు వెనకబడాలని ఆమె ప్రశ్నించారు.

యువత క్రమశిక్షణ విషయంలో సింగపూర్ అనుసరిస్తున్న పద్ధతి గురించి మాట్లాడుతూ, అక్కడ +2 తర్వాత యువతకు డిఫెన్స్ కోచింగ్ ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ఇది కేవలం దేశ రక్షణకు కాదని, క్రమశిక్షణ, బాధ్యత, దేశంపై ప్రేమ అలవడేలా చేయడానికని ఆమె చెప్పారు. ఈ దశ దాటిన యువత జీవితంలో ఏ పని చేసినా బాధ్యతగా చేస్తారని అన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి మెకానిజమ్ ఎలా తీసుకురావాలో కలెక్టర్లు ఆలోచించాలని ఆమె పిలుపు ఇచ్చారు.

హోం మంత్రిగా తనను అత్యంత ఆకర్షించింది అక్కడి శాంతిభద్రతల వ్యవస్థ అని ఆమె చెప్పారు. సింగపూర్‌లో క్రైమ్ రేట్ చాలా తక్కువని, దానికి కారణం పోలీసుల సంఖ్య కాదని వివరించారు. అక్కడి అధికారులు చెప్పిన మాట తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, “20 వేల మంది పోలీసులు ఉన్నా 20 లక్షల మంది పోలీసింగ్ చేస్తారని” వారు అన్నారని మంత్రి తెలిపారు. అంటే ప్రజలనే పోలీసులుగా తీర్చిదిద్దారని, శాంతిభద్రతలు తమ బాధ్యత అని ప్రజలకు అనిపించేలా చేయగలిగారని ఆమె అన్నారు.

ఆ వ్యవస్థను మరింత వివరిస్తూ.. అక్కడ ఏదైనా తప్పు జరిగితే 100కు డయల్ చేయాల్సిన అవసరం లేదని, Google లింక్ ద్వారా కంప్లయింట్ పెట్టవచ్చని మంత్రి తెలిపారు. అందులో ప్రత్యేకత ఏమిటంటే బాధితులు మాత్రమే కాదు, సంఘటన చూసిన ఏ పౌరుడైనా కంప్లయింట్ నమోదు చేయవచ్చని, వారి సమాచారం గోప్యంగా ఉంచడం వల్ల ప్రజలు భయపడకుండా ముందుకు వస్తున్నారని ఆమె వివరించారు.

న్యాయ వ్యవస్థలో సింగపూర్ అనుసరిస్తున్న అప్పీళ్ళ విధానం కూడా చాలా ఆదర్శంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. మన దగ్గర అప్పీల్ చేయడం చాలా సులభంగా ఉండటం వల్ల అదే కేసులు పదేళ్ళు, పదిహేనేళ్ళు నడుస్తున్నాయని ఆమె అన్నారు. సింగపూర్‌లో అప్పీల్ చేయాలంటే తప్పనిసరిగా కొత్త ఆధారాలు సమర్పించాలని, పాత విషయమే మళ్ళీ తీసుకొచ్చి కాలయాపన చేయడానికి ఆ వ్యవస్థ అనుమతించదని ఆమె వివరించారు. దీని వల్ల కేసులు వేగంగా తేలుతున్నాయని, బాధితులకు సత్వరం న్యాయం దొరుకుతోందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అది దేశ న్యాయ వ్యవస్థలో పెద్ద సంస్కరణకు నాంది పలుకుతుందని ఆమె సూచించారు.

ఈ అమూల్యమైన అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *