Breaking News

భారీ కంపెనీలకు అనుబంధ పరిశ్రమలుగా ఎంఎస్ఎంఈలు

-పారిశ్రామికాభివృద్ధి ఎకో సిస్టంలో ఎంఎస్ఈలు కీలకం
-వైద్య ఖర్చులు తగ్గాలి… విద్యుత్ భారం తగ్గాలి
-అసంఘటిత కార్మికులకూ నైపుణ్య శిక్షణ
-బెస్ట్ పాలసీలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్లు
-7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఏర్పడే భారీ పరిశ్రమలకు అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలకు అవకాశం ఉందని… వీటికి ఎంఎస్ఎంఈ రంగంలో ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్న సందర్భంలో ఏర్పడే ఎకో సిస్టంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించేలా చూడాలని ఆదేశించారు. రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో జరిగే 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా తొలి రోజైన గురువారం నాడు వివిధ శాఖల పనితీరు మీద.. క్షేత్ర స్థాయిలో అమలు విధానంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. దీంట్లో భాగంగా విద్య, వైద్యం, పెట్టుబడుల గ్రౌండింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థలకు భూ కేటాయింపులు వంటి విషయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని వెంటనే పరిష్కరించాలి. 22ఏ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించాలి. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీల ద్వారా నిషేధిత భూములను క్లియర్ చేయాలి. జిల్లాల్లోని వివిధ ఉత్పత్తులు పాన్ ఇండియా, గ్లోబల్ బ్రాండ్స్ కావాలి. అరకు కాఫీ లాంటి బ్రాండింగ్ ఏపీ ఉత్పత్తులకు రావాలి. మనం రోజూ వారీగా వినియోగించే చాలా ఉత్పత్తుల కొనుగోలు ద్వారా విదేశాలకు డబ్బులు చెల్లిస్తున్నాం. ఏపీ ఉత్పత్తులకు క్వాలిటీ, బ్రాండింగ్ వంటివి వస్తే ఆ ఆదాయం మనకే వస్తుంది. పారిశ్రామిక పార్కులు, ఉత్పత్తి యూనిట్ల వద్ద ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ అభివృద్ధి కావాలి. భారీ పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలుగా ఎంఎస్ఎంఈలు అభివృద్ధి కావాలి. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏపీకి రావడంతో క్యారియర్ ఏసీ సంస్థ రాష్ట్రానికి వచ్చింది. డేటా సెంటర్లకు, క్వాంటం కంప్యూటింగ్ వంటి వ్యవస్థలకు బల్క్ చిల్లర్స్ ను ఏపీకి వచ్చిన ఏసీ సంస్థలే సరఫరా చేస్తాయి. అమరావతిలో క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ ఏర్పాటు అయ్యింది. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ పని చేయటం ప్రారంభిస్తే వాటికి కావాల్సిన పరికరాల ఉత్పత్తి కూడా చేసేలా ఎకోసిస్టమ్ వస్తుంది. ఈ విధంగా అభివృద్ధి చెందే ఎకో సిస్టంలో ఎంఎస్ఎంఈలు కీలకంగా ఉండాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించేలా ప్రణాళికలు

“రాష్ట్రంలో 15 లేబర్ అడ్డాలు నిర్మిస్తున్నాం. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా… లేబర్ అడ్డాల్లో కూర్చొంటారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంటులో శిక్షణ ఇస్తాం. ఇక ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వారిలో ఆరోగ్య అవగాహన కల్పించాలి. ప్రీవెంటివ్ హెల్త్ సక్సెస్ అయితే ప్రజలకు వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి. జిల్లాల వారీగా హెల్త్ స్కోర్ లు తయారు చేయాలి. సోలార్ రూఫ్ టాప్, కుసుమ్ స్కీంలను ఇంటిగ్రేట్ చేసి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, పాఠశాలలు, కళాశాలలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. రానున్న కాలంలో విద్యుత్ నిమిత్తం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం రానంతగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద సోలార్ పవర్ ఉత్పత్తి జరగాలి. 22 లక్షల పంపు సెట్లకు పీఎం కుసుమ్ ద్వారా సోలార్ పవర్ పెట్టుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ కు మెంటార్లుగా జిల్లాల కలెక్టర్లను నియమిస్తాం. స్కూళ్లల్లో స్మార్ట్ కిచెన్ మెంటార్ గా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఉంటారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించాలి… అప్పుడు మరింతగా అభివృద్ధి సాధించగలం. రైలు మార్గం ద్వారా ప్రతీ కిలోమీటరుకు రూ. 1.83 వ్యయం అవుతోంది. రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోంది. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుంది. పారిశ్రామిక పార్కులకు రోడ్, రైల్ కనెక్టివిటీ పెరగాలి. రాష్ట్రానికి రూ.1 లక్ష కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు వస్తున్నాయి. రూ.64 వేల కోట్ల విలువైన 624 రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. ఎక్స్ ప్రెస్, లోకల్ ట్రైన్స్ లాంటి ప్రాజెక్టులు వస్తాయి. 4 లేన్లతో రైల్వే మార్గాల విస్తరణ జరగబోతోంది. ఆర్వోబీలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలి. లాజిస్టిక్స్ పార్కులు వస్తే పెద్ద ఎత్తున ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉంది… దీనికి తగ్గట్టు కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాధార పంటలు, మెట్ట పంటలు, ఉద్యాన పంటలకు అనుగుణంగా నీటి ప్రణాళికలు చేసుకోవాలి. పశువులకు దాణాకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రీన్ కవర్ పెరగాలి.. అటవీ శాఖ దీనిపై చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ… స్వచ్ఛ పథాల రహదారుల శుభ్రతపై దృష్టి పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తాం.” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *