అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలోఅంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను అందించే లక్ష్యంతో, లింగాయపాలెం గ్రామంలోని APCRDA భవనం ఎదురుగా ‘కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్’ హోటల్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ నిర్వహించారు. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్భూమిపూజకార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, లంకా దినకర్ చైర్మన్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ హాజరై ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ, 2019లో ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నామని, మరో ఆరు నెలల్లో పనులు ప్రారంభించి రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. 2029 నాటికి ఈ హోటల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఫోర్ స్టార్ డీలక్స్ హోటల్ అత్యాధునిక వసతులతో రెండు టవర్లుగా నిర్మితం కానుంది. ఒక్కో టవరు 10 అంతస్తుల చొప్పున మొత్తం 176 గదులు, లగ్జరీ రెసిడెన్సీలతో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, బార్ మరియు ఆల్డే డైనింగ్ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రెండు నుంచి మూడు వేల మంది సామర్థ్యంతో కూడిన భారీ బ్యాంకెట్ హాల్‌ను కన్వెన్షన్లు మరియు అంతర్జాతీయ ఈవెంట్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటి సంస్థల రాకతో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ హోటల్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా సుమారు 600 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తున్న వేగవంతమైన అనుమతులు మరియు మంత్రుల సహకారం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News