– తాలీం-ఏ-హునర్ కు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన.
– పేద ముస్లిం లు కూడా డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ లు కావాలనే లక్ష్యంతో కార్యక్రమం ప్రారంభించాం.
– 3 రోజుల్లో 3 వేలకు పైగా దరఖాస్తులు.
– 12 మే చివరి తేది కావడంతో దరఖాస్తులకు పోటెత్తుతున్న విద్యార్థులు.
– ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి.
– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన తాలీం-ఏ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్) కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కార్యక్రమం ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు పూర్తిగా ఉచిత రెసిడెన్షియల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటీ- జేఈఈ, నీట్ మరియు ఎమ్సెట్ కోచింగ్ అందించే ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగ పరుచుకోవాలన్నారు. పేద ముస్లిం విద్యార్థులు కూడా డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ లు కావాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. పేద కుటుంబంలో వెలిగే విద్యా దీపం ఆ కుటుంబ భవిష్యత్తునే కాదు, సమాజ భవిష్యత్తును కూడా మార్చగలదు అని ఆయన పేర్కొన్నారు. విద్యకు పేదరికం అడ్డుకాకూడదు అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనతో, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాస్యం మొహమ్మద్ ఫరూక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టాలెంట్ టెస్ట్ ద్వారా పూర్తిగా మెరిట్ ఆధారంగా 250 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నామని చెప్పారు. ఇందులో బాలికలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబడిందని వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది 12 మే 2026 మాత్రమేనని, అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తుల కోసం: https://apwaqfboard.el91.com/REH/ ను చూడాలన్నారు.
Prajavartha Online Telugu News