విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్‌లోని శాసనసభ్యుల కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం అనే గొప్ప విలువలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకుంటూ పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని ఆకాంక్షించారు.
క్రైస్తవ సోదర సోదరీమణుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం తెలియజేస్తూ రూపొందించిన ఈ పోస్టర్ సమాజంలో ఐక్యత, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేసేలా ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రతి మతాన్ని సమానంగా గౌరవించడం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నామని, సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నామని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బెజ్జం జైపాల్, మద్దాల చక్రవర్తి, దివి ఉమామహేశ్వరరావు, వేల్పుల రాజేష్, రత్నబాబు, బెజ్జం సురేష్, గడ్డం సామ్యూల్, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News