ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం – ప్రజలు, ఉద్యోగులు అపోహలకు లోనుకావద్దు

-ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు… డిపోలు, ఆస్తులు లీజుకు ఇవ్వడం లేదు… ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
-ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రవాణా, రోడ్లు & భవనాలు) ఎం. కృష్ణబాబు, ఐఏఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడంపై కొంతకాలంగా ప్రజల్లో, ఉద్యోగుల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించినట్లు రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణబాబు, ఐఏఎస్ తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారనడం పూర్తిగా అవాస్తవమని, సంస్థ డిపోలు, భూములు, ఇతర ఆస్తులను ఏ ప్రైవేటు సంస్థకూ లీజుకు ఇవ్వడం గానీ, బదిలీ చేయడం గానీ జరగదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే సంస్థలకు ఒప్పంద కాలంలో బస్సుల ఛార్జింగ్, నిర్వహణ కోసం మాత్రమే అవసరమైన ప్రాంగణాన్ని వినియోగించుకునే అనుమతి ఉంటుందని, ఆస్తుల యాజమాన్యం పూర్తిగా APSRTCదేనని తెలిపారు.
ప్రస్తుతం APSRTCలో డీజిల్ హైర్ బస్సులు నడుస్తున్న విధంగానే ఎలక్ట్రిక్ బస్సులు కూడా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) విధానంలో నడుస్తాయని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయం కాదని, భారత ప్రభుత్వం అమలు చేస్తున్న “PM e-Bus Sewa Scheme”లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలో ఉండటంతో పాటు భారీ మూలధన వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం GCC విధానాన్ని అమలు చేస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా CESL ద్వారా పారదర్శకంగా నిర్వహించిన పోటీ టెండర్లలో ఎంపికైన సంస్థలకు మాత్రమే బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగించబడినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 1,050 ఎలక్ట్రిక్ బస్సుల్లో తొలి విడతగా 750 బస్సులు రాష్ట్రంలోని ఎంపిక చేసిన డిపోల నుంచి నడవనున్నాయని చెప్పారు.
ఎలక్ట్రిక్ బస్సుల కోసం అవసరమైన విద్యుత్, సివిల్ మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల కారణంగా కొన్ని డిపోలలో ఉద్యోగులను తాత్కాలికంగా మాత్రమే పునర్వినియోగం (రీ-డిప్లాయ్‌మెంట్) చేస్తున్నామని, దీనిని ఉద్యోగుల బదిలీ లేదా ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశంగా ఎవరూ అపార్థం చేసుకోవద్దని స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు ప్రభుత్వ భూములు గుర్తించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఏ ఉద్యోగినీ తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అదనపు సిబ్బంది పేరుతో ఎవరినీ నిరుద్యోగులుగా చేయబోమని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగిస్తున్నామని, వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేపట్టే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లలో “డ్రై లీజ్” విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానంలో డ్రైవర్లు, సాధారణ మెకానికల్ నిర్వహణ వంటి సేవలను APSRTC ఉద్యోగులతోనే నిర్వహించే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. బ్యాటరీలు, పవర్ ట్రైన్ వంటి ప్రత్యేక సాంకేతిక నిర్వహణ మాత్రమే తయారీ సంస్థల బాధ్యతగా ఉండే విధంగా ప్రత్యామ్నాయ నమూనాలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ (AP SEMP–4.0) అమలు చేస్తోందని, 2029 నాటికి దశలవారీగా డీజిల్ బస్సులను ఆధునిక, ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయడం లక్ష్యమని తెలిపారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ, ఇంధన వ్యయాల తగ్గింపు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని, ప్రస్తుతం ప్రతి నెలా సుమారు రూ.350 కోట్ల మేర జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా APSRTC అవసరాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఎలాంటి అపోహలకు లోనుకాకుండా వాస్తవాలను మాత్రమే నమ్మాలని ప్రజలకు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేసిన ఎం. కృష్ణబాబు, ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, ప్రజలకు అత్యాధునిక, పర్యావరణహిత ప్రజారవాణా సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *