బందరులో ప్రతి గడపకూ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తా

– ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి తీరుతా
– ఓటు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను
– అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందించడమే లక్ష్యం
– క్యాంబెల్‌‌పేటలో తాగునీటి పైపులైన్ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలు అందించడమే నా లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలం క్యాంబెల్ పేట పరిధిలో తాగునీటి పైపులైన్ అభివృద్ధి పనులను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తో కలిసి ప్రారంభించారు. సభలో మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అందుకు గత ప్రభుత్వ హయాంలో నాసిరకమైన వస్తువుల వినియోగం కారణం అన్నారు. 20 సంవత్సరాలు ఉండాల్సిన విద్యుత్ వైర్లు నాలుగేళ్లకే పాడైపోవడం వారి దోపిడీకి నిదర్శనం. మొత్తం వైర్లను త్వరలోనే మెరుగు పరుస్తాం. రోడ్లు మొత్తం కూడా అభివృద్ధి చేస్తాం. మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తాం. కాలనీల్లోని రోడ్లకు కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తాం. ఫిషింగ్ హార్బర్ వరకు ఉన్న రోడ్డును సాస్కి పథకంలో భాగంగా అభివృద్ధి చేశాం. కల్వర్టును అభివృద్ధి చేశాం. రూ.2 కోట్లతో రోడ్డు పనులు కూడా చేపడుతున్నాం. మెడికల్ కాలేజీ ముందుండే రోడ్డు పనులు కూడా ప్రారంభించాం. వీలైనంత త్వరగా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న రోడ్డును రెండు వరుసలకు విస్తరించేందుకు కూడా ప్రతిపాదనలు పంపించాం. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో రూ.37 కోట్ల వ్యయంతో 50 కి.మీల మేర రోడ్లు నిర్మించాం. గరాలదిబ్బ నుండి పోలాటితిప్ప మధ్య బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో కూటమి ప్రభుత్వమే ప్రతిపాదించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే పనులు పూర్తి కాబోతున్నాయి.

రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. రాష్ట్ర విభజన సమయంలో అమరావతే రాజధాని అన్నాడు. కనీసం 50 వేల ఎకరాలుండాలి అన్నాడు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడాడు. న్యాయం కోరిన రైతుల్ని రక్తాలు కారేలా కొట్టాడు. ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా దుర్మార్గాలకు పాల్పడ్డాడు. 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డిని భూస్థాపితం చేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా నడిపిస్తుంటే.. ఇప్పుడు మావిగన్ అంటూ డ్రామాలాడుతున్నాడు. రాష్ట్ర ప్రజలతో పాటు పొరుగు రాష్ట్ర ప్రజలు కూడా వెక్కిరించే పరిస్థితికి తీసుకొచ్చారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలిచ్చే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇప్పుడు కూడా నారా లోకేశ్  రోజుకో దేశానికి వెళ్లి ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు.

ఎవరేంటో, ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూద్దాం. కానీ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేద్దాం. చిత్తశుద్ధితో పని చేస్తున్న టీడీపీ నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నా.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తున్నాను. బందరులో చోటా బచ్చాలు కూడా నీతులు మాట్లాడుతున్నారు. గతంలో తప్పుడు కేసులతో జైళ్లలో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. వారి అరాచకాన్ని గుర్తించి వారిని ఇంట్లో కూర్చోబెట్టి.. మాకు అవకాశం కల్పించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మంచి చేయడం నా కర్తవ్యం. విజయవాడ – బందరు రోడ్డు, మెడికల్ కాలేజీ, బందరు పోర్టు గతంలో ప్రారంభించాం.. త్వరలోనే పూర్తి చేసి చూపిస్తాం. పోర్టు అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చిన్నాపురం సమీపంలో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. బందరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరందుకుంది.

ఎన్ని ఇబ్బందులున్నా.. సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షనలు అందిస్తున్నాం. అన్న ఎన్టీఆర్ రూ.30తో ప్రారంభించిన పెన్షన్లు ప్రస్తుతం రూ.4000 చేశాం. జగన్ రెడ్డి రూ.3000 పెన్షన్ పేరుతో హామీ ఇచ్చి దగా చేశాడు. కానీ మేము హామీ మేరకు పెన్షన్ అమలు చేశాం. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల సేవలో లాంటి అనేక సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం.

ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దు అనేలా జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కులం, మతం, ప్రాంతం పేరుతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తులు రాష్ట్రానికి అవసరమా? రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. గూగుల్, అర్సెలార్ మిట్టల్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు ఏపికి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ మచిలీపట్నం మీదుగా కేబుల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో వచ్చాయి. ఆ ప్రాజెక్టు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బందరు నియోజకవర్గం మొత్తానికి తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి తీరుతానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *