-పి 4 తో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల విద్య, వైద్యం ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖల మంత్రి డా.డోలా. శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో విబిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేసే సంరక్షణ ఆర్థిక వ్యవస్థను రూపొందించడం అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి ముఖ్య అతిథిగా మంత్రి డా. స్వామి హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ లో… పేదరిక నిర్మూలన, ఆకలి లేని స్థితి, మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, తగిన పని మరియు ఆర్థిక వృద్ధి, అసమానతను తగ్గించడం, సుస్థిర నగరాలు మరియు సమాజాలు, శాంతి, న్యాయం మరియు బలమైన సంస్థలు, లక్ష్యాల సాధన కోసం భాగస్వామ్యం అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ప్రజల విద్య, వైద్యం ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పి 4 తో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. వీజీ బీ రామ్ జీ నుంచి యువతకు నైపుణ్య శిక్షణ వంటి వాటితో అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల ద్వారా కౌసల్యం కార్యక్రమంతో గ్రామాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి నైపుణ్య శిక్షణ ఇచ్చిన అనంతరం వారికి వర్క్ ఫ్రొం హోం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలి. వృద్ధులకు సైబర్ క్రైమ్స్ మోసాల పట్ల అవగాహన కల్పించాలి. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ వర్క్ షాప్ లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ కార్యదర్శి IAS ఎ. సూర్య కుమారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News