-రాష్ట్ర హస్తకళాకారుల అభ్యున్నతికి మరిన్ని సంస్కరణలు – లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన లేపాక్షి హస్తకళా మహోత్సవం–2026 అపూర్వ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు డా. పసుపులేటి హరి ప్రసాద్ లేపాక్షి సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మహోత్సవ విజయానికి ప్రతి ఉద్యోగి చూపిన అంకితభావం, క్రమశిక్షణ, సమన్వయం, సేవా తపన కారణమని కొనియాడారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సమావేశంలో డా. హరి ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వేలాది మంది హస్తకళాకారులు ఒకే వేదికపై సమావేశమై తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించడం హస్తకళా రంగానికి స్వర్ణాక్షరాలతో నిలిచిపోయే ఘట్టమన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు పరస్పరం కలుసుకొని అనుభవాలు పంచుకోవడం, మార్కెట్ అవకాశాలపై చర్చించడం, కొత్త సాంకేతికతలను తెలుసుకోవడం ద్వారా వారికి కొత్త ఉత్సాహం లభించిందన్నారు.
మహోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేసి ప్రతి హస్తకళాకారుడితో స్వయంగా మాట్లాడడం, వారి సమస్యలను ఓర్పుతో వినడం, లేపాక్షి ద్వారా అందించాల్సిన సహాయ సహకారాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కళాకారుల్లో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. కళాకారుల సంక్షేమంపై ఆయన చూపుతున్న చిత్తశుద్ధి అభినందనీయమని పేర్కొన్నారు. మహోత్సవంలో పాల్గొన్న కొందరు కళాకారులు ఆరోగ్య సమస్యలను తెలియజేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే వారికి కంటి పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సహాయం అందించడం ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమని డా. హరి ప్రసాద్ అన్నారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లేపాక్షి బ్రాండ్‌ను రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అత్యాధునిక లేపాక్షి షోరూమ్‌లను ఏర్పాటు చేసి హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు శాశ్వత మార్కెట్ కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు. ప్రతి కళాకారుడి ఉత్పత్తికి సరైన ధర, విస్తృత మార్కెట్, గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లేపాక్షి సంస్థను దేశంలోనే అత్యుత్తమ హస్తకళా సంస్థగా తీర్చిదిద్దడంలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలని, ఇదే నిబద్ధత, నిజాయితీ, సేవాభావంతో పనిచేస్తే హస్తకళాకారుల జీవితాల్లో మరింత వెలుగులు నింపగలమని ఆయన పేర్కొన్నారు.
చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ తెలిపిన అభినందనలు, ప్రోత్సాహకరమైన సందేశానికి స్పందించిన లేపాక్షి అధికారులు, ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర హస్తకళాకారుల సంక్షేమం, లేపాక్షి అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News