కడపలో కరోనాకు అడ్డుకట్ట వేయండి

-కలెక్టర్, డీఎంహెచ్ వోకు ఫోన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం
-కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయండి
-రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి
-వియత్నాంలో కడప వారి దుర్మరణంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
-బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
-ఎప్పటికప్పుడు విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నాం : మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ ను, డీఎంహెచ్ వో రవిబాబును ఫోన్లో ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కడపలో ఎనిమిది కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా ఇద్దరు మృతి చెందడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. స్థానికుల్లో కరోనా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, ఆసుపత్రుల వద్ద మాస్క్ లు వాడకం తప్పనిసరి చేయాలన్నారు. జ్వరం, దగ్గు, ఇతర కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్ వార్డుకు తరలించాలన్నారు. కలెక్టర్ శ్రీధర్, డీఎంహెచ్ వో రవిబాబు మాట్లాడుతూ, ఎనిమిది కరోనా కేసులు మినహా కొత్తగా కేసులు నమోదు కాలేదన్నారు. ప్రస్తుత కరోనా వెరియంట్ వ్యాప్తిపై శాంపిళ్లను పూణే ల్యాబ్ కు పంపామన్నారు. ప్రస్తుతం నమోదైన కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందుతుందా… నెమ్మదిగా సోకుతుందా..? అనేది ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులో వెల్లడవుతుందన్నారు. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టామని, బ్లీచింగ్ వెదజల్లామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కరోనా నమోదైన కుటుంబాల్లో సభ్యులకు కూడా తక్షణమే పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ నమోదయితే వారిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించాలన్నారు. నెగిటివ్ వస్తే… కొద్ది రోజుల పాటు వారి ఇళ్లల్లోనే ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపారు. మరో మరణం సంభవించకుండా, ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఉన్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మేరకు కోవిడ్-19 టీకాలు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ ను, డీఎంహెచ్ వో రవిబాబుకు మంత్రి సవిత ఫోన్లో స్పష్టంచేశారు.

వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం

వియత్నాం సందర్శనకు వెళ్లిన కడప వాసి, ఆ దేశంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆ దేశంలో జరిగిన బోటు ప్రమాదంలో ముడియం శ్రీధర్ సహా 15 మంది మృత్యువాతపడడం బాధాకరమన్నారు. సంతోషంగా ముగియాల్సిన విదేశీ టూర్ విషాదంగా ముగియడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి సవిత వ్యక్తంచేశారు. శ్రీధర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే విదేశాంగ అధికారులతో, ఢిల్లీ భవన్ అధికారులతో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారని తెలిపారు. ఏపీకి చెందిన టూరిస్ట్ లతో పాటు శ్రీధర్ మృతదేహాన్ని కూడా స్వస్థలానికి రప్పిస్తామన్నారు. ఎప్పటికప్పుడు వియత్నాం, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో మాట్లాడుతున్నామని మంత్రి సవిత తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *