విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలతో యూట్యూబర్ రావణ్ మీద మీద UAPA చట్టం కింద కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ NTR జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగిన చట్టబద్ధ పాలన కోసం ధర్మదీక్ష కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బలవంతులకు ఒక విధంగా, బలహీనులకు మరో విధంగా చట్టం అమలవుతోందనే సందేహం ప్రతి పౌరుడి మనసులో కలుగుతోందన్నారు.
నిషేధిత సంస్థల పట్ల కేవలం సానుభూతి చూపడం మాత్రమే శిక్షార్హం కాదని కోర్టులు స్పష్టం చేసినప్పటికీ, యూట్యూబర్ రావణ్‌పై UAPA వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. దేశంలో ప్రణాళికాబద్ధంగా విభజన సృష్టించే చర్యలు దేశ ఐక్యతకు ముప్పు అని చెప్పబడుతున్నప్పటికీ, అలాంటి చర్యలపై సమానంగా చట్టం అమలు కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. అలాగే సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ప్రతి సంస్థ చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, RSS వంటి పెద్ద సంస్థల చట్టపరమైన స్థితి, నిర్మాణం మరియు పారదర్శకతపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ అవసరమని భావిస్తున్నాము. అదేవిధంగా, నిషేధిత నక్సలైట్ల పట్ల సానుభూతి ఆరోపణలపై ఒక వ్యక్తిపై కఠిన చట్టాలు ప్రయోగిస్తే, ప్రజా చర్చలో ప్రస్తావించబడిన ఇతర ప్రముఖుల విషయంలో అదే ప్రమాణాలు ఎందుకు వర్తించవన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు.
చట్టం అధికారంలో ఉన్నవారికి, డబ్బున్నవారికి ఒకలా, సామాన్య ప్రజలకు మరోలా వర్తిస్తే, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని భావిస్తున్నాము. ఈ అంశాలపై స్పష్టత రావడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వాల బాధ్యత అని భావిస్తున్నామని నేతి మహేశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో పర్వతనేని హరికృష్ణ, కన్వీనర్, ఆమ్ ఆద్మీ పార్టీ, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News