పారిశ్రామిక అవసరాలకు మిగులు ఇథనాల్ విక్రయంపై మార్గదర్శకాలు పరిశీలన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మిగులు ఇథనాల్‌ను ఔషధ, పెయింట్స్, రసాయన పరిశ్రమలు తదితర పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా తగిన మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ అంశంపై గనులు, భూగర్భశాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన సచివాలయంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం కింద ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు పరిమిత పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున మిగులు ఇథనాల్ నిల్వలు పేరుకుపోతున్నాయని, ఇది పరిశ్రమల ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతోందని వివరించారు. ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాల్సిన ఇథనాల్‌ను పూర్తిగా సరఫరా చేసిన తర్వాత మిగిలే పరిమాణాన్ని మాత్రమే పారిశ్రామిక అవసరాలకు విక్రయించేలా అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

వినతిని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర, పారిశ్రామిక అవసరాల కోసం మిగులు ఇథనాల్ విక్రయానికి తగిన మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రభుత్వ చమురు సంస్థలతో ఉన్న ఒప్పందాలకు ఎలాంటి భంగం కలగకుండా, ఇథనాల్ దుర్వినియోగం జరగకుండా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తూనే, ఇథనాల్ దుర్వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు. పరిశ్రమల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మతో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *