-భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-ఎద్దుల బండిపై ర్యాలీగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు
-గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నెముక : నెట్టెం రఘురామ్ , ఎమ్మెల్యే యార్లగడ్డ.
-రైతులు, చేతివృత్తిదారులకు సహకార సంఘాల ద్వారా రుణాలు : నెట్టెం రఘురామ్
-సహకార్ సే సమృద్ధి పేరుతో సహకార రంగంలో అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నాం : నెట్టెం రఘురామ్
-సహకార సంఘాల్లో పారదర్శకతకు జీఓ-90 అమలు అవసరం : ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నెముక అని కృష్ణా జిల్లా కేంద్ర సహకార (కేడీసీసీ) బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో శనివారం నూతనంగా ఆధునీకరించిన ది బుద్దవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ (పీఏసీఎస్) ను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి పీఏసీఎస్ కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ర్యాలీగా చేరుకుని రైతులు, ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతన భవనాన్ని ప్రారంభించారు. పీఏసీఎస్ భవన నిర్మాణానికి స్థలం అందించిన దాత గూడవల్లి మల్లిఖార్జున వరప్రసాద్‌ను ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార వ్యవస్థ వెన్నెముక వంటిదని అన్నారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులు, చేతివృత్తిదారులకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం “సహకార్ సే సమృద్ధి” నినాదంతో దేశవ్యాప్తంగా సహకార సంఘాలను కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్ చేస్తోందని, రుణాల దరఖాస్తు నుంచి మంజూరు, ఆడిట్ వరకు అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించేలా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో 425 సహకార సంఘాలు రైతులకు సేవలందిస్తున్నాయని, వ్యవసాయ రుణాలతో పాటు వ్యవసాయేతర రుణాలను కూడా అందించే దిశగా కేడీసీసీ బ్యాంకు పనిచేస్తోందన్నారు.
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని సహకార సంఘాల అభివృద్ధిని ప్రత్యేకంగా చూడాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్‌ను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే కోరినట్లు తెలిపారు. ఆ మేరకు బుద్దవరం పీఏసీఎస్ భవనం ఆధునీకరణతో పాటు కొత్తపల్లి సహకార సంఘం అభివృద్ధి, సూరంపల్లిలో కళ్యాణమండపం నిర్మాణం, కేసరపల్లి పీఏసీఎస్ పునరుద్ధరణ, అక్కడ మూతపడిన బ్యాంకు శాఖను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించినందుకు నెట్టెం రఘురామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని సహకార సంఘాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై దాదాపు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని, కేసరపల్లి పీఏసీఎస్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొందన్నారు. ఆ సంఘాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రూ.8 లక్షలు అవసరమని ఫోన్‌లో చెప్పగానే వెంటనే నిధులు మంజూరు చేసిన కేడీసీసీ చైర్మన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 2 వేలకుపైగా సహకార సంఘాలు ఉండగా, కృష్ణా జిల్లాలో 425 సంఘాలు పనిచేస్తున్నాయని చెప్పారు. సహకార సంఘాల్లో పారదర్శక పాలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ-90ను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఒకే గ్రామంలో 30–35 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి సెక్రటరీ గా కొనసాగడం వల్ల సహకార సంఘాల్లో అక్రమాలు, అవకతవకలకు అవకాశం ఏర్పడుతోందన్నారు. చదువు లేని పీఏసీఎస్ అధ్యక్షులు ఉన్న చోట్ల కార్యదర్శులదే పూర్తి పెత్తనం సాగుతోందని, ఆర్థిక సంస్థల్లో ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేయడం మంచిది కాదన్నారు. జీఓ-90 అమలుపై పలుమార్లు సహకార శాఖ మంత్రిని కోరినా ఇప్పటికీ అమలు కాలేదని, ఇకనైనా కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్ ఆప్కాబ్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి అమలుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉన్న సమయంలో తన నియోజకవర్గానికి ప్రత్యేకత ఇవ్వలేకపోయానని… తాను అడిగిన వెంటనే ప్రస్తుతం నెట్టెం రఘురామ్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మంజూరు చేస్తుండడం సంతోషకరమన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని పీఏసీఎస్ అధ్యక్షులు, డైరెక్టర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సంఘాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను కేడీసీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.డి.ఏ సునీల్, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, ఏయంసి వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, బుద్ధవరం గ్రామ పి.ఏ.సి.ఎస్ చైర్ పర్సన్ ముద్రబోయిన శ్రీవాసరావు, డైరెక్టర్లు మన్నెం శ్రీనివాసరావు, గుర్రం రవి సత్యనారాయణ, కంభంపాటి లక్ష్మీ, బొప్పూడి ప్రవీణ్, గొంది నరేంద్ర, అన్నే హరికృష్ణ, మేడేపల్లి రమ, బుస్సే సరిత, దేవినేని సులోచన, నెక్కంటి శ్రీదేవి, బడుగు బాలమ్మ, సబ్బినేని తనూజ, మల్లారెడ్డి కిషోర్, వేమూరి రవి, కానూరు యుగంధర్, ఆర్నేపల్లి వరలక్ష్మి, మేకా స్వాతి, కొల్లి లక్ష్మీ నారాయణ, అరికట్ల రవి, బుస్సే నాగ ప్రసాద్, చిమటా రవివర్మ, సవలం దినేష్, బోయపాటి మురళీకృష్ణ, మద్దినేని వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి నవీన్, పాలడుగు నాని, గొంది శివ కోటేశ్వరరావు, గోగం బాల కోటయ్య, అట్లూరి నాని, మున్నంగి బాబురావు, బండి భాస్కర్, షేక్ కరీముల్లా, గార్లపాటి రాజేశ్వరరావు, పరుచూరి నరేష్, కాండ్రు అజయ్, సూరిబోయిన రాంబాబు, వేగే కృష్ణారావు, మొవ్వ వేణుగోపాల్, కనకవల్లి శేషగిరిరావు, నిమ్మకూరి మధు, మన్నెం శ్రీనివాసరావు మరియు స్థానిక రైతులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు సహకార సంస్థల అధికారులు, పిఏసిఎస్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News