-బాలల హక్కుల పరిరక్షణ అందరిదీ బాధ్యత.
-బాలల హక్కుల సేవల బలోపేతంపై చర్చా వేదిక నిర్వహణ.
-ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, విజయవాడ డైరెక్టర్ బి.ఎస్. కోటేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ శ్రీ.బి.ఎస్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, విజయవాడ ఆధ్వర్యంలో “బాలల హక్కుల సేవలను మరింత బలోపేతం చేసి విస్తరించడానికి భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై టి.వి.(టానా) భవన్, హనుమాన్‌పేట, విజయవాడలో బాలల హక్కుల కొరకు పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు స్వచ్ఛంద సేవ కార్యకర్తలతో చర్చా వేదిక నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బి.ఎస్. కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బాలల రక్షణ, సంరక్షణ, విద్య, ఆరోగ్యం, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, బాలల అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పోలీసులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వ్యవస్థాపన సభ్యులు, బాలల సేవలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఫాదర్. థామస్ కోషి మాట్లాడుతూ సమాజ స్థాయిలో బాలల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, గ్రామ మరియు వార్డు స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సంబంధిత శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, బాలల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం గురించి తెలియచేసారు.
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ బాలల హక్కుల రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు మరియు ఇతర భాగస్వాములు ముందుకు రావాలని తెలిపారు . బాలల సంక్షేమం కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరమని పేర్కొంటూ, భవిష్యత్‌లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, కమ్యూనిటీ, విద్యాసంస్థలలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి బాలల హక్కుల పరిరక్షణ కార్యకర్త వరంగల్ నుండి విచ్చేసిన సంతోష్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు.
ఇందులో భాగంగా ” బాలల భద్రత – అందరి భాద్యత ” అనే పోస్టరు ను ఆవిష్కరణ చేయటం జరిగినది.
కార్యక్రమంలో కేర్ & షేర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు జే.ఎల్.వి. ప్రసాద్, పి రత్నం , SKCV చిల్డ్రన్స్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీ కాజా చంద్ర, నవజీవన్ బాల భవన్ , క్రాఫ్ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి , శారదా స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ శారద , హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ CEO అనిల్ కుమార్, లిటిల్ హోప్ ట్రస్ట్ నిర్వాహకులు జోన్స్ మానికొండ, ఆర్మీ సోషల్ సర్వీస్ సొసైటీ చైర్మన్ ఆర్ ఎస్ రాజు, ఆనంద మహిళా మండలి సంధ్య, సర్వీస్ స్వచ్ఛంద సేవా సంస్థ అనిల్ కుమార్,వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బాలల హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు, సామాజిక సేవకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News