-నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపునకు చర్యలు
-ఉద్యానవన రైతులు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలి
-అర్హులైన రైతులు ఉద్యానవన పంటల సాగుకు ముందుకు రావాలి
-జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
విబిజి రాంజీ పథకం కింద చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలతో, రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు
జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విబిజి రాంజీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో చేపడుతున్న నీటి కుంటలు (ఫారం పాండ్స్) తవ్వకం పనులను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విబిజి రాంజీ పథకం ద్వారా చేపడుతున్న పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలన్నారు. పథకం ద్వారా చేపడుతున్న పనులు రైతుల వ్యవసాయ అవసరాలను తీర్చడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు దోహదపడేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా నీటి కుంటల నిర్మాణాలు వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసి పట్టుకునే విధంగా ఉండాలని, తద్వారా భూగర్భ జలాల పెంపునకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయానికి నీటి లభ్యతను మెరుగుపరచడంతో పాటు భూగర్భ జలాలను రీచార్జ్ చేసే విధంగా నీటి కుంటలను శాస్త్రీయ పద్ధతుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి కుంటల తవ్వకం పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు భవిష్యత్‌లో కూడా ఉపయోగపడేలా నిర్మాణాలను చేపట్టాలని శ్రామికులకు, సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం విబిజి రాంజీ పథకం కింద రైతు తన వ్యవసాయ క్షేత్రంలో 1.80 ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ మొక్కలను నాటుతున్న రైతుతో మాట్లాడి పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా నిమ్మ మొక్కను నాటారు. ఉద్యానవన పంటల సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలు, పథకం ద్వారా అందుతున్న సహాయాన్ని రైతుకు వివరించారు. విబిజి రాంజీ పథకం కింద ఉద్యానవన పంటలు సాగు చేసుకునే రైతులకు మొక్కల పెంపకానికి అవసరమైన వివిధ పనులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మొక్కలకు గుంతలు తవ్వడం, మొక్కల నిర్వహణ, నీటి వినియోగం తదితర అవసరాలకు సంబంధించి మూడు సంవత్సరాల కాలంలో దశల వారీగా రూ.2.60 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యానవన పంటలతో పాటు రైతులు అంతర పంటలను సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రధాన పంటల మధ్యలో అనువైన అంతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉద్యానవన తోటలు పూర్తిస్థాయిలో దిగుబడికి వచ్చే వరకు అంతర పంటల ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం కలిగేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులకు తగిన సూచనలు, సాంకేతిక సలహాలు అందించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. తక్కువ నీటి వినియోగంతో సైతం మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉద్యానవన పంటల ద్వారా ఉంటుందని తెలిపారు. అర్హులైన రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఉద్యానవన పంటల సాగుకు ముందుకు వస్తే, విబిజి రాంజీ పథకం కింద మొక్కలతో సహా అవసరమైన సహాయాన్ని ఉచితంగా అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విబిజి రాంజీ పథకం ద్వారా రైతులకు అందుతున్న ప్రయోజనాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులను గుర్తించి, పథకం ప్రయోజనాలు వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రాల్లో చేపట్టే ప్రతి పనీ రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో జి.అనీల్ కుమార్, జగ్గయ్యపేట తహసిల్దార్ ఎస్.శిరీష, డ్వామా ఏపీవో కె.రామకృష్ణ, డీఎల్‌డీఓ లక్ష్మీ కుమారి, ఎంపీడీవో అరుణ కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News