-పర్యావరణ పరిరక్షణకు 20 ఏళ్ల ప్రణాళికతో ముందుకు సాగాలి
-తాటి చెట్లు, మడ అడవులతో తీర ప్రాంతాల రక్షణ
-పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి
-సూర్యలంక బీచ్ లో విద్యార్థులతో కలిసి తాటి మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంతో పాటు జీవవైవిధ్యం, జీవరాశుల మనుగడను కాపాడుకోవడానికి విస్తృత స్థాయిలో పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు పేర్కొన్నారు. మొక్కలు నాటడం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, భావి తరాల భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే కార్యక్రమం కాదని, రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో, నిరంతర కృషితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గురువారం బాపట్ల జిల్లా సూర్యలంకలో పర్యటించారు. సముద్రపు కోతను అరికట్టడానికి విద్యార్థులతో కలిసి తాటి చెట్లను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “గ్రేట్ గ్రీన్ వాల్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యావరణం గురించి పుస్తకాల్లో చదవడం, కాగితాలపై అవగాహన పొందడం కంటే పిల్లలు, పెద్దలు స్వయంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణలో భాగస్వాములు కావడం ద్వారా ప్రకృతితో మరింత గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువతతో పాటు సమాజంలోని ప్రతి వర్గాన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తాం. మొక్క నాటడంతోనే బాధ్యత పూర్తి కాదని, అది ఆరోగ్యంగా ఎదిగి పెద్ద చెట్టుగా మారే వరకు సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మొక్కల పెంపకాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, భావితరాలకు పచ్చని, సురక్షితమైన భవిష్యత్తును అందించే సామాజిక బాధ్యతగా భావించాలి.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలి
పర్యావరణ పరిరక్షణ కోసం రూపొందించే ప్రణాళికలు కనీసం 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏ ప్రాంతాల్లో ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచాలి, భవిష్యత్తులో అక్కడి పర్యావరణ అవసరాలు ఎలా ఉంటాయి అనే అంశాలను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రత్యేకంగా తీరప్రాంతాల్లో తాటి చెట్లు, మడ అడవుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. తుపాన్లు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో మడ అడవులు, తాటి చెట్లు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. తీరప్రాంత ప్రజల భద్రతతో పాటు జీవవైవిధ్య పరిరక్షణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సూర్యలంక వంటి తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కోసం అధికారులు చేపడుతున్న చర్యలను అభినందించారు. ప్రకృతి సంపదను, అరుదైన జీవజాతులను కాపాడుకోవడం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే” అన్నారు.
విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన నాగబాబు
అంతకుముందు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నాగబాబు బాపట్ల జిల్లా సూర్యలంకలో విస్తృతంగా పర్యటించారు. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన సూర్యలంకలోని ఏపీఎఫ్డీసీ రిసార్ట్‌ను సందర్శించి, అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నగర వనంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్‌ను చైర్మన్ తిలకించారు. ఈ సందర్భంగా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, స్థానికులతో కలిసి సముద్ర తీర ప్రాంతంలో తాటి మొక్కలను నాటారు. సముద్ర కోతను అరికట్టడంలో తాటి చెట్ల ప్రాధాన్యతను, ఏపీ “గ్రేట్ గ్రీన్ వాల్” ప్రాజెక్ట్ విశేషాలను అధికారులు ఈ సందర్భంగా నాగబాబు కి వివరించారు. 20 ఏళ్ల క్రితం నాటిన తాటి చెట్లు ప్రస్తుతం సహజ రక్షణ గోడలా మారి తీరాన్ని కాపాడుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్యాక్ వాటర్స్‌లో బీచ్ స్కూటర్లపై వెళ్లి మడ అడవులను స్వయంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, అటవీ శాఖ సలహాదారుడు పి. మల్లికార్జున రావు, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ గ్రీన్ బి.ఎన్.ఎన్. మూర్తి, సీసీఎఫ్ గుంటూరు వై. శ్రీనివాసరెడ్డి, ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ గొన్నాబత్తుల శ్రీకాంత్, అటవీ శాఖ ఐటీ సలహాదారుడు పి. నాగబాబు, బాపట్ల డీఎఫ్ఓ శ్రీమతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News