Breaking News

కూటమి ధర్మం పాటిస్తూనే.. జనసేన గౌరవానికి అగ్ర తాంబూలం

-స్థానిక సమరంలో జన సైనికులకు సముచిత ప్రాతినిధ్యం
-నిస్వార్థం జనసేన సైనికుల అసలైన నైజం
-సేవ చేయడంలో పార్టీల రంగులు చూడొద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు
-పవన్ కళ్యాణ్ పర్యావరణ ఆశయాలకు అండగా నిలవడం నా అదృష్టం
-బాపట్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి త్యాగాలు చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి సముచితమైన ప్రాతినిధ్యం దక్కేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ కోసం కార్యకర్తలు చేసిన సేవలు, వారి త్యాగాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ప్రాంతంలో సముచితమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ నాయకత్వం కృషి చేస్తోందన్నారు. గురువారం బాపట్ల నియోజకవర్గం జన సైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… “పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా, స్థానిక సంస్థల్లో జనసేన ప్రాతినిధ్యం మరింత బలోపేతం అయ్యేలా నిర్ణయాలు ఉంటాయి. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ గౌరవం, కార్యకర్తల ఆకాంక్షలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతాం.
కార్యకర్తల శ్రమే జనసేన బలం
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్తను నాయకత్వం ఎప్పుడూ దగ్గరకు తీసుకోవాలని, వారి మాటలను వినాలని పవన్ కళ్యాణ్ బలంగా చెబుతుంటారు. ఈ రోజు చట్టసభల్లో జనసేన గొంతు బలంగా వినిపిస్తోందంటే అందుకు ప్రధాన కారణం జనసైనికులు చేసిన నిరంతర పోరాటం, వారి శ్రమే కారణం. జనసైనికులంటే పవన్ కళ్యాణ్ కి ఎంతో ప్రేమ, అభిమానమనే విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా, జనసైనికులు పవన్ కళ్యాణ్ ని ఎంతగా ప్రేమిస్తారో కూడా ఆయనకు తెలుసు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజలకు మెరుగైన భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్  ముందుకు సాగుతున్నారు. కార్యకర్తల నమ్మకం, ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని మరింత మెరుగైన దిశగా తీసుకెళ్లేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.
ఆయన కల కోసం నిలబడే అవకాశం దక్కింది
పర్యావరణ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ కన్న కలను సాకారం చేసే దిశగా పనిచేసే అవకాశం తనకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా లభించింది. పవన్ కళ్యాణ్ ఆశయానికి ఎంతో కొంత నా వంతుగా నిలబడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. బాపట్లతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. తన తండ్రి ఉద్యోగరీత్యా మూడేళ్లకుపైగా బాపట్లలో ఉన్నారు. బాపట్లలోనే చదువుకున్నాం.  పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే జన్మించారు. జనసేన కార్యకర్తల్లో ప్రత్యేకమైన ఆవేశం, నిస్వార్థం ఉంటాయి. వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయరు. ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా, ఆయన ఆశయాలు, ఆదేశాలను నమ్మకంతో పాటిస్తూ ముందుకు సాగడమే జనసేన కార్యకర్తల ప్రత్యేకత.
సేవ చేయడంలో తేడా ఉండదు
మన ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, పార్టీ కార్యకర్తలు ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి తేడా ఉండకూడదనే భావనతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. పులివెందుల వంటి ప్రాంతాల్లో జనసేనకు పెద్దగా బలం లేకపోయినా అక్కడి ప్రజలు ఏ పార్టీకి చెందిన వారైనా, రాజకీయంగా ఎవరిని అభిమానించినా, సేవ అందించే విషయంలో మాత్రం పార్టీలు, రాజకీయ భేదాలు చూడకూడదని పవన్ కళ్యాణ్ విశ్వసిస్తారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరినీ సమానంగా చూడటం, అందరికీ అందుబాటులో ఉండటమే ఆయన రాజకీయ విధానం” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిత్యావసరాల ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలు

– రూ.35కే కిలో ఉల్లిపాయలు అందించేందుకు నిర్ణయం – 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *