Breaking News

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1393 వ (56వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

1. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్య శాఖ:
పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట గ్రామంలో కొత్తగా వెటర్నరీ డిస్పెన్సరీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం YSR కడప జిల్లా ఒంటిమిట్ట ఏరియా వెటర్నరీ ఆసుపత్రి నుంచి ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టును, స్థానిక రైతు సేవా కేంద్రం (RSK) నుంచి ఒక యానిమల్ హజ్బెండ్రీ అసిస్టెంట్ పోస్టును రెగ్యులర్ ప్రాతిపదికన సర్దుబాటు చేయడంతో పాటు, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టును అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ డిస్పెన్సరీ నిర్వహణకు ఏటా ₹21,13,441/- వ్యయం కానుంది.

ఈ నిర్ణయం వల్ల అచ్చమ్మకుంటతో పాటు 5 కిలోమీటర్ల పరిధిలోని మరో ఐదు గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 12,648 పశువులు, కోళ్లకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా జిల్లాలో పశు సంరక్షణ, ఉత్పత్తి గణనీయంగా పెరగనున్నాయి.

2. వ్యవసాయ & సహకార శాఖ:
2026–27 మార్కెటింగ్ సీజన్‌లో తోతాపురి మామిడికి మద్దతు ధర (Support Price) అమలు చేసేందుకు అవసరమైన నిధులను వర్కింగ్ క్యాపిటల్ / స్వల్పకాలిక రుణాల (Short-term Loans) ద్వారా సమీకరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్ (AP MARKFED)కు అనుమతిని (Concurrence) పొడిగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

3. వ్యవసాయ & సహకార శాఖ:
2026 సీజన్‌లో 94 మిలియన్ కిలోల తక్కువ రకం, నాణ్యత లేని (Low and off-Style) పొగాకు కొనుగోలుకు సంబంధించి ధరల లోటు భర్తీ మద్దతుగా (Price Deficiency Support) కిలోకు ₹10/- చొప్పున పొగాకు రైతులకు నేరుగా నగదు బదిలీ (DBT) ద్వారా అందించేందుకు AP మార్‌్Kఫెడ్‌కు ₹94 కోట్ల నిధులను సమకూర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

4. జల వనరుల శాఖ:
కృష్ణా, NTR, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లో రూ.624.88 లక్షల విలువైన 78 వరద నష్ట పునరుద్ధరణ పనులకు పరిపాలనా ఆమోదం ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా మేజిస్ట్రేట్లు తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

5. న్యాయ శాఖ:
గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటుకు గతంలో జీవో (G.O. Ms. No. 6, తేదీ: 23.01.2023) ద్వారా అనుమతి ఇచ్చారు. అయితే ఇతర కోర్టుల నుంచి సిబ్బంది పోస్టులను బదిలీ చేసే అవకాశం లేదని హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) స్పష్టం చేయడంతో పాటు, అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు కేడర్ నిబంధనల ప్రకారం రెగ్యులర్ నియామకాలకు ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖామాత్యులు చేసిన విజ్ఞప్తి మేరకు మంగళగిరి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కోర్టు సజావుగా పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది, రికరింగ్ మరియు నాన్-రికరింగ్ బడ్జెట్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, మొత్తం 21 రెగ్యులర్ పోస్టులను మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

6. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు & బీమా వైద్య సేవల శాఖ:
రాజమహేంద్రవరంలోని ESI ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య, పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

7. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతిలోని టైప్-B, C, D & E LPS రోడ్లకు సిమెంట్ కాంక్రీట్ పేవ్‌మెంట్లకు బదులుగా బిటుమినస్ (ఫ్లెక్సిబుల్) పేవ్‌మెంట్లను నిర్మించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీకి చెందిన CRRI మరియు చీఫ్ ఇంజనీర్ల బోర్డు (BoCE) సిఫార్సులకు లోబడి, IRC:37-2018 ప్రమాణాల ప్రకారం 5 MSA డిజైన్ ట్రాఫిక్ లోడింగ్ కోసం 30 మి.మీ. (BC) + 50 మి.మీ. (DBM) + 250 మి.మీ. (WMM) + 150 మి.మీ. (GSB) పేవ్‌మెంట్ క్రస్ట్‌తో వీటిని రూపకల్పన చేయనున్నారు. APCRDA అథారిటీ తీర్మానం నం.702/2026కు అనుగుణంగా దీనిపై తదుపరి చర్యలు చేపట్టేందుకు ADCL ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం కల్పించారు.

8. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం (GoM) 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను, అలాగే APCRDA అథారిటీ తీర్మానం (నం.708/2026, తేదీ: 27.08.2026)ను ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా అమరావతి ల్యాండ్ అలాట్‌మెంట్ నిబంధనలు-2017 (Rules and Regulations) ప్రకారం తదుపరి చర్యలు చేపట్టేందుకు APCRDA కమిషనర్‌కు అధికారం కల్పించింది.

9. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతిలోని శాకమూరు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం మరియు గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్‌లతో కూడిన “అమరావతి సంఘమం” నిర్మాణానికి ఐటమ్ రేట్ కాంట్రాక్ట్ / EPC మోడ్–2 కింద GST మరియు ఇతర నిబంధనలతో కలిపి మొత్తం ₹759.793 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు DPL నుండి ₹310.080 కోట్లు, APHRDI నుండి ₹277.949 కోట్లు, APCRDA నుండి ₹171.764 కోట్ల చొప్పున నిధుల సమీకరణ నిబద్ధతతో (Funding commitment) అమలు చేయనున్నారు. అథారిటీ తీర్మానం నం.699/2026కు అనుగుణంగా దీనిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు APCRDA కమిషనర్‌తో పాటు AGICL మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం కల్పించారు.

10. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతి మీదుగా ఎర్రుపాలెం–నంబూరు నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి 100 మీటర్ల బఫర్‌తో పాటు, క్యాపిటల్‌ సిటీ సరిహద్దు నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ (IRR) వరకు గ్రిడ్‌ రోడ్ల విస్తరణతో కూడిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటుకు, రైతుల అభ్యర్థన మేరకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ (LPS) చేపట్టేందుకు APCRDA కమిషనర్‌కు అధికారం కల్పించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు గుంటూరు జిల్లా కంతేరు గ్రామంలో 974.00 ఎకరాలు, తాడికొండ మండలం పరిధిలో 5,238.50 ఎకరాలు—మొత్తం 6,212.50 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సమీకరించేందుకు అనుమతి మంజూరు చేసింది.

11. రెవెన్యూ శాఖ:
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వావిల్ తోట గ్రామంలో సర్వే నెం.824/20లో 18.20 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం ఎకరానికి రూ.28,75,000/- చెల్లింపుపై, సాధారణ నిబంధనలకు లోబడి APIICకి బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

12. రెవెన్యూ శాఖ:
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం పోగురుపల్లె గ్రామంలో సర్వే నెం.254 తదితరాల్లో 50.56 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ (MSME పార్క్) ఏర్పాటు కోసం చెల్లింపు ప్రాతిపదికన, సాధారణ నిబంధనలకు లోబడి APIICకి బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

13. రెవెన్యూ శాఖ:
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో సర్వే నెం.90లో 20.01 ఎకరాల భూమిని కొత్త సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ & ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం రెవెన్యూ శాఖకు ఉచితంగా, సాధారణ నిబంధనలకు లోబడి బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

14. రెవెన్యూ శాఖ:
చిత్తూరు జిల్లా విజయపురం మండలం కోసలనగరం గ్రామంలో సర్వే నెం.266/1B తదితరాల్లో 17.13 ఎకరాల భూమిని కోసలనగరం పారిశ్రామిక పార్కుకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు కోసం చెల్లింపు ప్రాతిపదికన, సాధారణ నిబంధనలకు లోబడి APIICకి బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

15. రెవెన్యూ శాఖ:
చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలం తెనబండ గ్రామంలో సర్వే నెం.290/3B/3 తదితరాల్లో 10.33 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం ధర చెల్లింపు ప్రాతిపదికన, సాధారణ నిబంధనలకు లోబడి APIICకి బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

16. రెవెన్యూ శాఖ:
YSR కడప జిల్లా దువ్వూరు (గ్రామం & మండలం)లో సర్వే నెం.1453/2లో 25.00 ఎకరాల భూమిని AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 మేరకు PM-కుసుమ్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం లీజు ప్రాతిపదికకు బదులుగా మార్కెట్ విలువ చెల్లింపుపై NREDCAP వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

17. రెవెన్యూ శాఖ:
ఎన్‌టీఆర్‌ జిల్లా, విజయవాడ రూరల్‌ మండలం, వేమవరం గ్రామంలో LPM నం.163లో 2.81 ఎకరాలు, LPM నం.721లో 7.31 ఎకరాలు, మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని AP Economic Cities Promotion and Development Corporation Ltd. (APEDCO)కు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

JET CITYలో ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ ఏర్పాటు కోసం ఈ భూమిని చెల్లింపు ప్రాతిపదికన, ప్రభుత్వం నిర్దేశించిన సాధారణ నిబంధనలు మరియు ఇతర షరతులకు లోబడి కేటాయించేందుకు అనుమతి మంజూరు చేసింది.

18. రెవెన్యూ శాఖ:
క్రియాశీల కాలువ ప్రాంతం, హైడ్రాలిక్ నిర్వహణ జోన్ మరియు తప్పనిసరి 20 అడుగుల నీటిపారుదల రైట్-ఆఫ్-వే బఫర్‌ను మినహాయిస్తూ, కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం మరియు నిర్వహణ హక్కులకు పూర్తి రక్షణ ఉండేలా జాయింట్ కమిటీ సిఫార్సుల మేరకు, మొత్తం 62.70 ఎకరాలలో 22.31 ఎకరాల భూమి వర్గీకరణను “కెనాల్ పోరంబోకు” నుండి “ఏ.డబ్ల్యూ. డ్రై”గా మార్చేందుకు మరియు అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు జారీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

జాయింట్‌ కమిటీ సిఫారసుల మేరకు, మొత్తం 62.70 ఎకరాల్లో క్రియాశీల కాలువ ప్రాంతం, హైడ్రాలిక్‌ ఆపరేషనల్‌ జోన్‌, తప్పనిసరి 20 అడుగుల ఇరిగేషన్‌ రైట్‌ ఆఫ్‌ వే (RoW) బఫర్‌ ప్రాంతాలను మినహాయించి, 22.31 ఎకరాల భూమిని “Canal Poramboke” నుంచి “A.W. Dry”(Alternate Wetting and Drying)గా వర్గీకరణ మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం, నిర్వహణ హక్కులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రక్షణ చర్యలు కొనసాగిస్తూ, అర్హులైన పేద లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు జారీ చేసేందుకు అనుమతి మంజూరు చేసింది.

19. ఇంధన శాఖ:
APGENCO సీలేరు కాంప్లెక్స్‌లోని విద్యుత్‌ కేంద్రాలకు Fire NOC పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ అగ్నిమాపక సేవల శాఖకు చెల్లించాల్సిన Fire Precautionary Fee నుంచి మినహాయింపు కల్పించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ మినహాయింపును మంగళగిరి AIIMS, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వర్తిస్తున్న విధానానికి సమానంగా APGENCO సీలేరు కాంప్లెక్స్‌ విద్యుత్‌ కేంద్రాలకు వర్తింపజేయాలని నిర్ణయించింది.

20. ఇంధన శాఖ:
APTRANSCO సంస్థ M/s పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (PFC) నుండి తీసుకున్న మధ్యకాలిక రుణం తిరిగి చెల్లింపునకు పూచీగా, PFCకు అనుకూలంగా రూ.950.00 కోట్ల మేర ప్రభుత్వ హామీని కొన్ని షరతులతో ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

21. ఇంధన శాఖ:
G.O.Ms.No.62, ఇంధన (పవర్.II) శాఖ, తే.28.07.2025 ద్వారా M/s RVR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RVRPPL)కు కేటాయించిన 800 MW అవుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కేటాయింపును రద్దు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

22. ఇంధన శాఖ:
AP Integrated Clean Energy Policy–2024 కింద అనంతపురము జిల్లాలోని కనేకల్‌, బొమ్మనహాల్‌ మండలాల్లో 300 మెగావాట్ల Wind-Solar Hybrid ప్రాజెక్టులో కేటాయించిన 180 మెగావాట్ల విండ్‌, 120 మెగావాట్ల/172 MWp DC సోలార్‌ సామర్థ్యాల్లో 28 మెగావాట్ల మేర విండ్‌, సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యాలను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు M/s. Ganeko Three Energy Pvt. Ltd.కు అనుమతి మంజూరు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

23. ఇంధన శాఖ:
APPDCL, PFC మరియు REC నుండి పొందిన రూ.500.00 కోట్ల చొప్పున మధ్యకాలిక రుణాలకు (MTLs) సంబంధించి PFCకు రూ.500 కోట్లు, RECకు రూ.550 కోట్ల చొప్పున కార్పొరేట్ హామీలను జారీ చేసేందుకు APGENCO మేనేజింగ్ డైరెక్టర్‌కు అంగీకారం తెలిపే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

APPDCL సంస్థ PFC, REC సంస్థల నుంచి పొందిన ₹500 కోట్ల చొప్పున మధ్యకాలిక రుణాలకు (MTLs) భద్రతగా, APGENCO మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారా PFCకి ₹500 కోట్లకు, RECకి ₹550 కోట్లకు కార్పొరేట్‌ గ్యారంటీలు జారీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేబినెట్‌ ఆమోదించింది. ఈ గ్యారంటీలను నిర్దేశిత నిబంధనలు, షరతులకు లోబడి జారీ చేయడానికి సమ్మతి తెలిపింది.

24. ఇంధన శాఖ:
పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులోని E&M, H&M పనులకు సంబంధించి Price Variation లెక్కింపునకు NHPC విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న M/s. Megha Engineering & Infrastructure Limited (MEIL) అభ్యర్థనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు GST మినహాయించి ₹472.86 కోట్లు, GSTతో కలిపి ₹557.97 కోట్ల ధర వ్యత్యాస మొత్తాన్ని NHPC విధానం ప్రకారం పరిగణించేందుకు అనుమతి మంజూరు చేసింది.

25. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్య శాఖ:
ఆంధ్రప్రదేశ్ “పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029” ముసాయిదాకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆధునిక Environment Controlled Poultry Shedsను ప్రోత్సహించడం, వ్యాధుల పర్యవేక్షణ–నివారణ, బయోసెక్యూరిటీని మెరుగుపరచడం, గ్రామీణ/బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీని అభివృద్ధి చేయడం, పౌల్ట్రీ ఉత్పత్తుల ప్రాసెసింగ్–విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, మార్కెట్ మరియు ఎగుమతి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పాలసీ ద్వారా పౌల్ట్రీ ఉత్పత్తి వ్యవస్థను మరింత ఆధునీకరించి, బయోసెక్యూరిటీ ప్రమాణాలను పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అదనపు ఆదాయ అవకాశాలు మెరుగుపడనున్నాయి. గుడ్లు, కోళ్ల మాంసం లభ్యత మరియు వినియోగం పెరగడంతో పాటు ప్రాసెసింగ్, కోల్డ్‌చైన్ మౌలిక వసతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు మరియు ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది.

పాలసీలో వివిధ అంశాల కింద మొత్తం రూ.657.18 కోట్ల మేర ఆర్థిక ప్రోత్సాహకాలను సూచించారు. ఇందులో వడ్డీ రాయితీ మరియు Environment Controlled Poultry Sheds కోసం మూడేళ్లలో రూ.120 కోట్లు పశుసంవర్ధక శాఖ బడ్జెట్ కేటాయింపుల నుంచి, నిధుల లభ్యత మరియు మంజూరుకు లోబడి వినియోగించేందుకు గుర్తించారు. ఈ పాలసీ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు వర్తిస్తుంది; అయితే ఆయా భాగాలకు నిర్దేశించిన అర్హతలు, మార్గదర్శకాలు, ఆర్థిక పరిమితులు మరియు సాధ్యాసాధ్యాలకు లోబడి ప్రయోజనాలు అందుతాయి.

పౌల్ట్రీ ఫారాల తప్పనిసరి రిజిస్ట్రేషన్ ద్వారా ఫారాల ట్రేసబిలిటీ, వ్యాధుల పర్యవేక్షణ, బయోసెక్యూరిటీ నిబంధనల అమలు మెరుగుపడటంతో పాటు వ్యాధుల వ్యాప్తి సమయంలో పశుసంవర్ధక శాఖ వేగంగా స్పందించేందుకు వీలు కలుగుతుంది. గ్రామీణ కుటుంబాల కోసం మదర్ పౌల్ట్రీ యూనిట్లు, గ్రామీణ/బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ NLM, SERP, PMEGP తదితర కార్యక్రమాలతో అనుసంధానం చేయనున్నారు.

అయితే పాలసీ కింద ప్రయోజనాలు అన్ని పౌల్ట్రీ రైతులకు స్వయంచాలకంగా అందవు. రిజిస్ట్రేషన్, అర్హత, ధృవీకరణ, నిర్దేశిత ఆర్థిక పరిమితులు, సంబంధిత మార్గదర్శకాలు మరియు బడ్జెట్ లభ్యత ఆధారంగా ప్రోత్సాహకాలు మంజూరు చేయబడతాయి.

26. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ:
గ్రామీణ నీటి సరఫరా పథకాల (RWS) పనుల్లో కాంట్రాక్టు/నిర్మాణ సంస్థల జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు, పారదర్శకమైన “కాంపిటీటివ్ బిడ్డింగ్‌ను” ప్రోత్సహించేందుకు మరియు దీర్ఘకాలిక నిర్వహణను పటిష్టం చేసేందుకు వీలుగా ఆపరేషన్ & మెయింటెనెన్స్ (O&M) విధానంలో తగిన సవరణలు చేస్తూ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ (DLP)ను హేతుబద్ధీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం సింగిల్ విలేజ్ స్కీమ్‌లకు (SVS) 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, అలాగే మల్టీ విలేజ్ స్కీమ్‌లకు (MVS/BWS) 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌తో పాటు 10 సంవత్సరాల పనితీరు ఆధారిత నిర్వహణ (Performance-based O&M) వర్తిస్తుంది.

ఈ విధానం అమలు ద్వారా గ్రామీణ కుటుంబాలు, పట్టణ స్థానిక సంస్థలు (ULBs), పరిశ్రమలకు నిరంతరం పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడి అదనపు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తాగునీటి సేకరణ కోసం వెచ్చించే సమయం ఆదా కావడం వల్ల ప్రజల పనివేళలు సద్వినియోగమై తలసరి ఆదాయం పెరుగుతుంది; అలాగే గ్రామాల్లో ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన సామాజిక సంబంధాలు బలపడతాయి.

27. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ:
జల్ జీవన్ మిషన్ (JJM 2.0) నిర్దేశించిన గడువులోగా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసి, “హర్ ఘర్ జల్” లక్ష్యాన్ని వేగవంతం చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మొత్తం ₹4,053.85 కోట్ల అంచనా వ్యయంతో 13,252 పనులను పునరుద్ధరిస్తూ, పునర్వ్యవస్థీకరణతో పాటు పరిపాలనా ఆమోదం మంజూరు చేశారు. దీనిలో సింగిల్ విలేజ్ స్కీమ్స్ (SVS) కింద ఉన్న 13,247 పనులను గ్రామాల వారీగా హేతుబద్ధీకరించి ₹3,046.11 కోట్లతో 7,439 పథకాలుగా, అలాగే మల్టీ విలేజ్ స్కీమ్స్ (MVS) కింద 334 గ్రామాలకు ప్రయోజనం చేకూరేలా ₹1,007.74 కోట్లతో 5 పథకాలను చేపట్టనున్నారు. పనుల హేతుబద్ధీకరణ నేపథ్యంలో, గతంలో ₹1,811.81 కోట్ల వ్యయంతో 2,943 పనుల మంజూరుకు ఇచ్చిన G.O.Ms.No.94 (తేదీ: 22.07.2026) ఉత్తర్వులను రద్దు చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం తగ్గనుంది.

ఈ పథకాల ద్వారా గ్రామీణ కుటుంబాలు, పట్టణ స్థానిక సంస్థలు (ULBs), పరిశ్రమలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు పరిశ్రమల స్థాపనకు వీలు కలిగి కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. తాగునీటి కోసం వెచ్చించే సమయం ఆదా కావడం వల్ల ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుంది; సమాజంలో సత్సంబంధాలు బలపడతాయి.

28. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ:
చిత్తూరు జిల్లా గుండుపల్లె మండలం పోగురుపల్లె గ్రామంలో సర్వే నెం.196/1 తదితరాల్లో 8.65 ఎకరాల మేత భూమి (గ్రేజింగ్ గ్రౌండ్ పోరంబోకు)ను AP పంచాయతీ రాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 58(2) కింద ఉపసంహరించి, పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం ఆ భూమి వర్గీకరణను “గ్రేజింగ్ గ్రౌండ్ పోరంబోకు” నుండి “అసెస్డ్ వేస్ట్ డ్రై (AWD)”గా మార్చే విధంగా దానిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

29. హోం శాఖ:
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అత్యవసర స్పందన (Emergency Response), వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిరోధక చర్యల కోసం పోలీస్ శాఖ ప్రస్తుతం దాదాపు 10,500 వాహనాలను వినియోగిస్తోంది. అయితే వాహనాలు పాతబడిపోవడం, నిరంతర వినియోగం కారణంగా పెద్ద సంఖ్యలో నిరుపయోగంగా మారాయి. 2022 నుండి ఇప్పటివరకు 2,556 వాహనాలను తుక్కు (Scrap)గా గుర్తించి పక్కన పెట్టగా, కేంద్ర రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నిబంధనల ప్రకారం మరో ఐదేళ్లలో 4,281 వాహనాలు కాలం చెల్లనున్నాయి. ఈ కొరత పోలీస్ శాఖ పనితీరు, అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ సమస్యను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSPHCL) ద్వారా కొత్తగా 4,760 పోలీసు వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంగళగిరిలోని SBI-SME బ్రాంచ్ నుండి ₹324.20 కోట్ల టర్మ్ లోన్‌ను ప్రభుత్వ పూచీకత్తుతో (Government Guarantee) సేకరించేందుకు, ప్రభుత్వం మంజూరు చేసే వాయిదాల (EMIs) ద్వారా ఆ రుణాన్ని తిరిగి చెల్లించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ ప్రమోషన్ సమావేశం..పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా సుదీర్ఘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *