– రూ.35కే కిలో ఉల్లిపాయలు అందించేందుకు నిర్ణయం
– 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి
– పామాయిల్‌ను సబ్సిడీ ధరలకు అందించేలా చర్యలు
– 10 వేల మెట్రిక్ టన్నుల KNM రకం బియ్యం సేకరణకు ఆదేశం
– సామాన్యులపై ధరల భారం పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి – మంత్రివర్గ ఉపసంఘం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం గురువారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమలు చేస్తున్న బియ్యం మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమానికి అదనంగా ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్‌పై తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ధరల పెరుగుదల ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన కీలక నిత్యావసర వస్తువుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వంతో పౌరసరఫరాల శాఖ నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులు సూచించారు.
కిలో ఉల్లిపాయలు రూ.35కే
వినియోగదారులకు కిలో ఉల్లిపాయలను రూ.35కే అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఉల్లిపాయల నిల్వలను రాష్ట్రానికి కేటాయించే అంశాన్ని NCCF దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. కేంద్రం నుంచి కేటాయించిన నిల్వలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందుల కేటాయింపునకు విజ్ఞప్తి, కందిపప్పు ధరల నియంత్రణకు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖను కోరారు. వాటిని ప్రాసెసింగ్ చేసి రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరలకు కందిపప్పుగా వినియోగదారులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
పామాయిల్‌ను సబ్సిడీ ధరలకు అందించేలా చర్యలు
పామాయిల్ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తక్షణ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. NCCF ద్వారా పామాయిల్ సేకరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. NCCFతో సమన్వయం చేసుకుని అవసరమైన పామాయిల్‌ను సమకూర్చి వినియోగదారులకు సబ్సిడీ ధరలకు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించింది.
651 ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు
బియ్యం ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 651 ప్రత్యేక కౌంటర్లు, రైతు బజార్ల ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 10,163 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించగా, దాదాపు లక్ష మంది వినియోగదారులు ప్రయోజనం పొందారు. వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే KNM రకం బియ్యాన్ని నెల్లూరు జిల్లాలోని రైస్ మిల్లర్ల నుంచి 10,000 మెట్రిక్ టన్నులు సేకరించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఈ బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరకు విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వినియోగదారులకు ధరల భారం నుంచి ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్, బియ్యం సహా నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కృత్రిమ కొరతకు అవకాశం లేకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లో లభించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News