Breaking News

రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదు

-ఎల్ నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు… అనంతరం మంత్రి పార్థసారథి ఎల్నినో అంశంపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి ప్రజలకు తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరుతడి పంటల సాగు వైపు అన్నదాతలు దృష్టిసారించే విధంగా చైతన్యవంతులను చేయాలని ఆదేశించారని వివరించారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా పంట నష్టపోకూడదని, ఏ ఒక్క ఎకరంలో పంట కూడా ఎండిపోకూడదని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు.

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయిందని, ఇప్పటి వరకు 52శాతం తక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి పార్థసారథి వివరించారు. దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదైన రాష్ట్రాల్లో మన రాష్ట్రం మొదటి రెండు స్థానాల్లో ఉందన్నారు. సాధారణ వర్షపాతం నమోదైతే ఈ పాటికి దాదాపు 90 శాతం భూమి సాగులోకి వచ్చేదని, కాని ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 60-65 శాతం మాత్రమే సాగులోకి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎల్ నినో ప్రభావాలను రైతులకు వివరిస్తూ, వారికి పంట మార్పిడిపై తగు సూచనలు, సలహాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

ఆరుతడి పంటల వైపు రైతన్నలు మొగ్గుచూపేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 90వేల కిలోల ఆరుతడి పంటల విత్తనాలను పంపిణీ కోసం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. విత్తనాల సబ్సిడి కోసం రూ. 90 కోట్ల ఆర్థిక సాయానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు.

పశు రక్షణలో భాగంగా పశుగ్రాస కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. జీ రామ్ జీ భాగస్వామ్యంతో పశుగ్రాస పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. అదేవిధంగా ఉద్యానపంటల ను సైతం కోపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఉద్యాన పంటల సాగుకు నీటి సరఫరా ఎంతో అవసరమని, వాటిని కాపాడుకోవడానికి అవసరమైతే జీ రామ్ జీ పనుల ద్వారా సమీప చెరువుల నుండి కాలువలు ద్వారా నీటిని తరలించడం లేదా బిందు సేద్యంపై అవగాహన పెంచి అందుకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.

జిల్లాల్లో ఉన్న అగ్రికల్చర్ యూనిర్సిటీలు, కాలేజీల అధ్యాపకుల తో రైతులకు తక్కువ నీటి వనరుతో లాభదాయక పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వరి సాగుకు ఎక్కువ పరిమాణంలో సాగునీరు అవసరం ఉంటుందని, కాని ఎల్ నినో ప్రభావంతో సాగు నీరు అందని స్థితి నెలకొందన్న విషయం వరి సాగు రైతులకు స్పష్టంగా వివరించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఫలితం ఉంటుందన్నారు.

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో త్రాగునీటి కష్టాలు తప్పేలా లేవని, రాష్ట్రవ్యాప్తంగా 14,829 హ్యాబిటేషన్లు ఉన్నాయి. నివాస ప్రాంతాల వారీగా ప్రపోజల్స్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజలందరికీ త్రాగునీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వివరించారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేయడం లేదా ట్యాంకర్లు ద్వారా త్రాగునీటిని సరఫరా చేయడం వంటి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుండి ట్యాంకర్లు అద్దె ప్రాతిపదికన తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావాన్ని వివరిస్తూ కేంద్రానికి లేఖలు రాయాలని, కేంద్రానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తూ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వాతావరణ ఆధారిత భీమా ను చేయడంలో మన రాష్ట్రం దేశంలోనే 6 వ స్థానంలో ఉందని, కరువు నిధులు ఎక్కువగా రాష్ట్రానికి అందేలా కృషి చేస్తున్నామన్నారు. కేంద్రం, రాష్ట్ర, జీ రామ్ జీ నిధుల అనుసంధానంతో కరువు పరిస్థితులను గట్టేక్కాలే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.

తిరుపతి నుండి ఎన్ఐఈఎల్ఐటీ(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సంస్థ తరలించడం లేదని, కొందరు చేస్తున్నదుష్ప్రచారం లో వాస్తవం ఎంతమాత్రం లేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగాల్లో మన రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అమరావతిలో క్వాంటం ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, మన రాష్ట్రంలో మూడు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి లభించిందని మంత్రి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి కందుల దుర్గేష్

-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ ప్రమోషన్ సమావేశం..పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా సుదీర్ఘ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *