-మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు.. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబరు 18 తుది గడువు
-సెప్టెంబరు 27న రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు-2025-26 ప్రదానం
-వివరాలు వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు-2025-26 (‘State Annual Tourism Excellence Awards) ప్రదానం చేయనున్నట్లు వెలగపూడి సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో పర్యాటకుల అనుభవాలను మెరుగుపరచడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం,సాంకేతికతను జోడించడాన్ని ఉద్దేశించి “డిజిటల్ ఎజెండా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటకరంగ పునర్నిర్మాణం”(Digital Agenda and Artificial Intelligence to redesign tourism) అనే థీమ్‌తో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో రాష్ట్రంలో పర్యాటక, ఆతిథ్య, ప్రయాణ రంగాలలో అంకితభావంతో సేవనందిస్తున్న భాగస్వాములను ప్రోత్సహించడం, వారిలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని,నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం లక్ష్యంగా పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాలలో 46 పురస్కారాలను అందించనున్నామన్నారు.ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో సాధించిన పురోగతి, పర్యాటకుల రాక, ఆదాయం, సేవా నాణ్యత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకుల సంతృప్తి ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తామన్నారు. ‘ఎకో-ఫ్రెండ్లీ హోటల్’, ‘బెస్ట్ బీచ్’ (బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలు) విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ క్రియేటర్ల సేవలను ప్రత్యేకంగా గుర్తించనున్నట్లు వెల్లడించారు.దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 18న సాయంత్రం 5 గం.ల వరకు తుది గడువు ఉంటుందని,గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించబడవు అన్నారు.దరఖాస్తులను నేరుగా లేదా పోస్ట్ ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, 5వ అంతస్తు, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు పంపించాలని వెల్లడించారు. నిర్ణీత నమూనాలో దరఖాస్తు ఫారమ్ నింపడంతో పాటు సాధించిన విజయాలపై 100 పదాలకు మించకుండా చిన్న నివేదిక, కనీసం ఒక హై-రిజల్యూషన్ ఫోటోగ్రాఫ్ తో కూడిన పత్రాలను పెన్ డ్రైవ్ లో ఇవ్వొచ్చని తెలిపారు..దరఖాస్తు ఫామ్ సహా మరిన్ని వివరాలకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ అధికారిక వెబ్‌సైట్ www.aptourism.gov.inను సందర్శించాలని వివరించారు. ప్రాంతీయ సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక రంగాలలో పర్యాటక రంగ ప్రాధాన్యతను చాటిచెప్పడానికి, 1970లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ నిబంధనలను ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News