-రాష్ట్రంలో రూ.300 కోట్ల పెట్టుబడులకు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతిపాదన
-భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో MRO ఏర్పాటుకు మెల్‌స్టార్ ఏవియేషన్ ఆసక్తి
-పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. సుస్థిర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొందని మంత్రి పేర్కొన్నారు.
అమరావతి సచివాలయంలోని ఆర్ & బీ, ఐ & ఐ శాఖ కార్యాలయంలో నేడు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ డైరెక్టర్ వివేక్ అగర్వాల్, ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించింది. రాష్ట్రంలోని వివిధ పోర్టుల్లో సరుకు నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, రైల్వే లింక్డ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేసేందుకు సంస్థ ప్రతినిధులు తమ ఆసక్తిని మంత్రికి వివరించారు.
ఏపీలో రూ.300 కోట్ల పెట్టుబడులకు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ ఆసక్తి
సుమారు 30 ఏళ్ల అనుభవం, రూ.1,500 కోట్ల టర్నోవర్ కలిగిన శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిందని మంత్రి తెలిపారు. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ రంగంలో సేవలందిస్తున్న సంస్థ, ఏపీలో పోర్టులు, రైల్వే కనెక్టివిటీ, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్‌ల అభివృద్ధికి అవకాశాలను పరిశీలిస్తోంది.
లాజిస్టిక్స్ రవాణా ఖర్చులను తగ్గించడంతో పాటు రాష్ట్రంలో రవాణా, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన *ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AP-LINK)*పై సంస్థ ప్రతినిధులు ప్రశంసలు వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను వారు అభినందించారు.
పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంత్రితో జరిగిన చర్చలు సానుకూలంగా సాగడంపై సంస్థ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
ఏపీలో ఏవియేషన్ రంగానికి భారీ అవకాశాలు
అదేవిధంగా, మెల్‌స్టార్ ఏవియేషన్ సంస్థ డైరెక్టర్ తరుణ్ కశ్యప్ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసి రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్న Melstarr Aviation Learning Academy (MALA) లో పైలట్ శిక్షణ కేంద్రం పురోగతిని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ శిక్షణ కేంద్రానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
విజయవాడ విమానాశ్రయంలో Aircraft Maintenance Engineering (AME) శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో పూర్తి స్థాయి Maintenance, Repair and Overhaul (MRO) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయాల విస్తరణతో పాటు MRO, AME, పైలట్ శిక్షణ వంటి అనుబంధ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతో పాటు విమానయాన రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.
నూతన ఏవియేషన్ పాలసీపై ప్రశంసలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఏవియేషన్ పాలసీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని మెల్‌స్టార్ ఏవియేషన్ ప్రతినిధులు ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి పెరుగుతున్న డిమాండ్, అందుబాటులోకి వస్తున్న ఆధునిక విమానాశ్రయాలు, అనుకూలమైన పారిశ్రామిక విధానాలతో గ్లోబల్ స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షితమవుతున్నాయని పేర్కొన్నారు.
పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకు రావాలని మెల్‌స్టార్ ఏవియేషన్ ప్రతినిధులను మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగ అభివృద్ధికి, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
MRO, AME, పైలట్ శిక్షణ వంటి రంగాల ద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, అనుకూలమైన విధానాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News