Breaking News

గోదావరిలో కలుస్తున్న డ్రెయిన్ కాలుష్యంపై సమగ్ర అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

-ప్రతి డ్రెయిన్‌పై నిరంతర పర్యవేక్షణ.. నమూనాల శాస్త్రీయ పరిశీలన..
-జీవ నదిలోకి చేరుతున్న వ్యర్థాలపై ప్రత్యేక అధ్యయనం
-పరిమితికి మించిన కాలుష్యంపై నియంత్రణ చర్యల అమలుకు ఆదేశాలు
-ప్రత్యేక పర్యావరణ టాస్క్ ఫోర్స్‌కు బాధ్యతలు
-రూ. 100 కోట్ల పీసీబీ నిధులతో మురుగు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచన
-కాలుష్య రహిత గోదావరిలో భక్తులు పుష్కర స్నానమాచరించేలా చర్యలు
-‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ థీమ్‌తో గోదావరి పుష్కరాలకు సిద్ధమవుతున్న వేళ గోదావరి నదిని సంపూర్ణ కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గోదావరిలో డ్రెయిన్ల ద్వారా కలుస్తున్న కాలుష్య కారక వ్యర్థాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నాటికి గోదావరి పవిత్రత ఉట్టిపడేలా, భక్తులు స్వచ్ఛమైన జలాల్లో స్నానమాచరించే వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.
రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు, గోదావరి నదిలో కలుస్తున్న అన్ని ప్రధాన, ఉప డ్రెయిన్లపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు 15 ప్రధాన డ్రెయిన్లు, 45 వరకు మైనర్ డ్రెయిన్లు గోదావరి నదిలో కలుస్తున్నాయని, వాటి ద్వారా చేరుతున్న మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని సూచించారు.
యనమదుర్రు వంటి డ్రెయిన్లు పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ జలాలను వెంట తీసుకుని వశిష్ట గోదావరిలో కలుస్తున్నాయని, అలాగే రామచంద్రపురం పరిసర ప్రాంతాల మురుగు టేకి మేజర్ డ్రెయిన్ ద్వారా, అమలాపురం ప్రాంత వ్యర్థాలు కుమ్మర కాలువ ద్వారా, ధవళేశ్వరం సమీపంలోని వ్యర్థాలు గోరింకల డ్రెయిన్ ద్వారా గోదావరిలోకి చేరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. పట్టణ ప్రాంతాల మురుగుతోపాటు గోదావరి తీరం వెంబడి ఉన్న 262 గ్రామ పంచాయతీల నుంచి వెలువడే మురుగుకు కూడా గోదావరి నదే అంతిమ గమ్యస్థానంగా మారడం ఆందోళనకర అంశమన్నారు.
ప్రతి డ్రెయిన్‌లో క్రమం తప్పకుండా నీటి నమూనాలు సేకరించి కాలుష్య స్థాయిలను నిర్ధారించాలని, జీవ రసాయన ఆక్సిజన్ (BOD), రసాయన ఆక్సిజన్ (COD), ఘన వ్యర్థాలు, భారీ లోహాలు, హానికారక రసాయనాల వంటి అంశాలపై విశ్లేషణ చేపట్టాలని ఆదేశించారు. పారిశ్రామిక వ్యర్థాలు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేయబడుతున్నాయా లేదా అనే అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని, డ్రెయిన్ల నుంచి వ్యర్థ జలాలు గోదావరిలో కలిసే ముందు శుద్ధి కావాలని స్పష్టం చేశారు.
డ్రెయిన్ల ద్వారా గోదావరిలో కలుస్తున్న వ్యర్థాల స్వరూపం, కాలుష్య స్థాయిలు, కాలుష్యానికి కారణమవుతున్న వనరులు, ప్రస్తుతం అమలులో ఉన్న శుద్ధి చర్యల ప్రభావం వంటి అంశాలపై నిరంతరం అధ్యయనం చేపట్టాలని, పరిమితికి మించి కాలుష్యాన్ని గుర్తించిన సందర్భాల్లో తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.
గోదావరి కాలుష్య నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని తెలిపారు. అవసరమైతే కాలుష్య నియంత్రణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ సమన్వయకర్తగా, పురపాలక, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖ, వ్యవసాయ, మత్స్యశాఖల కమిషనర్లు, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా శాఖల చీఫ్ ఇంజినీర్లు, గోదావరి పరివాహకంలోని ఆరు జిల్లాల కలెక్టర్లు సభ్యులగా ఉండే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కాలుష్య నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలను నిరంతరం సమీక్షించాలని దిశా నిర్దేశం చేశారు.
గోదావరి తీరప్రాంత గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ లక్ష్యంతో చర్యలు ప్రారంభించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పుష్కరాల నాటికి ఈ గ్రామాలను “మోడల్ పుష్కర పంచాయతీలు”గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలోనూ శుద్ధి చేయని మురుగు నీరు గోదావరిలో కలవకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
గోదావరి నది ప్రక్షాళనను అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా తీసుకున్నామని, “స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు” అనే థీమ్‌తో సమగ్ర కార్యాచరణ కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గోదావరి ప్రక్షాళన విజయవంతంగా పూర్తైన అనంతరం కృష్ణా నదితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులను కూడా కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని చెప్పారు. భవిష్యత్తులో జరిగే కృష్ణా పుష్కరాలను కూడా ఇదే థీమ్‌తో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిత్యావసరాల ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలు

– రూ.35కే కిలో ఉల్లిపాయలు అందించేందుకు నిర్ణయం – 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *