Breaking News

వన్య ప్రాణుల మరణాలపై సమగ్ర అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి ఆదేశం

-క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రణాళికలపై సమగ్ర అధ్యయనం
-అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు
-జంతువుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలపై నివేదిక కోరిన పవన్ కళ్యాణ్
-రాష్ట్రంలో మరింత పటిష్టంగా వన్యప్రాణి సంరక్షణ చర్యలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పులుల మరణాలపై అధ్యయనానికి అటవీశాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలను అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు.
వన్యప్రాణుల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు అమలు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత హనుమాన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, ప్రత్యేక పరిస్థితుల్లోనూ జంతువుల సంరక్షణ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాలు, వాటి ఫలితాలను శాస్త్రీయంగా విశ్లేషించి, అవసరం ఉన్న చోట మరింత పకడ్బందీగా చర్యలు అమలు చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్  ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీశాఖ సలహాదారు మల్లిఖార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి రాహుల్ పాండే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాలను సందర్శించి, వాటి మరణాలకు దారితీస్తున్న అంశాలు, ఆవాసాల్లో పరిస్థితులు, సంచార మార్గాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, వేట నిరోధక చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, నీటి వనరుల లభ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దీంతో పాటు పులులు, చిరుతలు, ఏనుగులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి, నివారణ చర్యలపై సూచనలు చేయనుంది. వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, సహజ ఆహార వనరుల పెంపు, సంచార మార్గాల సంరక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించి పవన్ కళ్యాణ్ కి అందజేస్తుంది.
దీంతో పాటు మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విద్యుత్ లైన్లు, రహదారులు, రైల్వే మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాల వల్ల ఏర్పడే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కమిటీ కీలక సిఫార్సులు చేయనుంది. వన్యప్రాణుల భద్రతకు మొదటి నుంచే పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుపతి సమీపంలో నీటి కోసం వచ్చిన కృష్ణజింక ఇనుప కంచెలో ఇరుక్కుని మృతి చెందిన ఘటనతో చలించిన ఆయన, వేసవిలో జంతువుల దాహార్తిని తీర్చేందుకు వాటి సంచార మార్గాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహకారంతో నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు.
వన్యప్రాణుల సంరక్షణలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రత్యేక కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తున్నారు. వీటికి మరింత బలం చేకూర్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శాస్త్రీయ పరిశోధనలు, క్షేత్రస్థాయి చర్యలు అమలు చేస్తూ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మరింత సమర్థవంతమైన సంరక్షణ వ్యవస్థను రూపొందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడాలన్నది ఉప ముఖ్యమంత్రి ఆకాంక్ష. రాష్ట్రంలోని వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, సంచార మార్గాల పరిరక్షణ, మరణాల నివారణ, మానవ–వన్యప్రాణి ఘర్షణల నిరోధం ద్వారా ఆంధ్రప్రదేశ్ తాలూకు జీవవైవిధ్య వారసత్వాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో కార్యాచరణ ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *