-ఎ.కొండూరుకు జేజేఎం–అమరజీవి జలధారలు
-ఉద్ధానం తరహా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
-గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రాజెక్టుకు ప్రాణం పోసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-26 నెలల కాలంలో రూ. 49.94 కోట్ల పనులు పూర్తి
-38 ఆవాసాల పరిధిలో 130 కిలోమీటర్ల పైప్‌లైన్
-ఇంటింటికీ కుళాయిలతో దాదాపు 75,000 మందికి స్వచ్ఛమైన తాగునీరు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్) బారినపడిన ప్రజలతో మరో ఉద్దానాన్ని తలపించే ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా, ఎ.కొండూరు మండలం. ఈ మండల పరిధిలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు, 38 ఆవాసాలు ఉండగా, దాదాపు అన్ని గ్రామాలు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో గిరిజనులు మాత్రమే నివసించే 15 తండాలున్నాయి. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క, ప్రమాదమని తెలిసినా కలుషిత జలాలతో గొంతు తడుపుకునే పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎ.కొండూరుకు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను కిడ్నీ వ్యాధి బారి నుంచి కాపాడాలని సంకల్పించారు. అధికారం చేపట్టిన 26 నెలల్లోనే తన పరిధిలోని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ద్వారా జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధారల నిధులతో ఎ.కొండూరు తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేశారు. రూ. 49.94 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 100 శాతం పనులు పూర్తి చేసుకుని ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలను తీర్చింది.
– గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టలేదు
ఎ.కొండూరు తాగునీటి ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వం ఆర్భాటం చేసి, కనీసం టెండర్ ప్రక్రియను కూడా మొదలుపెట్టలేదు. ఒక్క పనీ ప్రారంభించలేదు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన ప్రాజెక్టు కావడం, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2024 మార్చి నాటికి గడువు కూడా ముగియడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పనులను ముందుకు తీసుకెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను మరో నాలుగేళ్లు పొడిగించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా తక్షణమే విడుదల చేసి, పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లింది. కిడ్నీ వ్యాధితో ప్రజలు పడుతున్న అవస్థలను చూసి చలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయించారు. ఇబ్రహింపట్నం ఎన్టీపీసీ కాలువ నుంచి కృష్ణా జలాలను స్వీకరించి, అక్కడే శుద్ధి చేసి, 130 కిలోమీటర్ల పైప్‌లైన్, 12 ఓవర్‌హెడ్ ట్యాంకుల సహకారంతో దాదాపు 75,000 మందికి ఒక్కొక్కరికి రోజుకు 55 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. ఎ.కొండూరు తాగునీటి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, రైల్వే శాఖలతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పైప్‌లైన్ నిర్మాణానికి అత్యంత త్వరితగతిన అనుమతులు లభించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లారు.
గతంలో ఎ.కొండూరు మండల పరిధిలోని ప్రజలకు ట్యాంకర్ల సాయంతో తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ. 2.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. నేడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధారల రూపంలో తాగునీటి సమస్యకు, తద్వారా కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం లభించినట్టయింది. త్వరలో ఎ.కొండూరు ప్రాంతంలో పర్యటించి తాగునీటి పథకం పనుల నాణ్యతను ఉప ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేయాలని ఇప్పటికే కార్యాలయ అధికారులకు నిర్దేశం చేశారు.
Prajavartha Online Telugu News