Breaking News

అభివృద్ధి.. సంక్షేమంతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్

-ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశాం
-సోలార్ తో సొంత విద్యుత్ తయారీ
-పీఎం కుసుమతో రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
-కారంచేడు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బాపట్ల జిల్లా కారంచేడులో సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన మూడు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. సీఎస్‌ఆర్‌ నిధులతో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిన దాతలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఇటువంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే.. అవి ప్రజలకు నాలుగు కాలాల పాటు ఉపయోగపడేలా నిర్వహించడం మరో ఎత్తని అన్నారు. కారంచేడులో మూడు, నాలుగు దశాబ్దాల తర్వాత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.3.50 కోట్లతో కొత్త పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరో రూ.6 కోట్లతో పూర్తిస్థాయిలో కొత్త పైపులైన్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి హామీల అమలు…

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు, గ్యాస్‌ తదితర పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ల కోసమే కూటమి ప్రభుత్వంలో ఏడాదికి సుమారు రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి.. మరోవైపు సంక్షేమ పథకాల అమలుతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. అందరూ కలసి పని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌ రంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ నిరంతరాయంగా అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. భవిష్యత్‌లో విద్యుత్‌ అవసరాలకు ఇతర వనరులపై ఆధారపడకుండా మన అవసరాలకు మనమే విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేలా సౌర విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

సంక్షోభాలను అధిగమించేందుకు స్థానిక వనరుల వినియోగం….

రాష్ట్రంలో ఆరు లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. రూ.2 లక్షలతో సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.78 వేలకుపైగా సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్ర సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు అందిస్తుందని వివరించారు. పీఎం కుసుమ్‌ పథకం ద్వారా రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విదేశీ యుద్ధాలు, ఇతర కారణాలతో గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ కొరత ఏర్పడిన సందర్భాల్లో సమస్యను అధిగమించేందుకు మనకున్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యఘర్ వంటి పథకాల ద్వారా మనం వాడుకునే విద్యుత్ ను మనమే తయారు చేసుకునే అవకాశం ఉందన్నారు. అందుకే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ… ప్రజలు ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష…

అనంతరం పర్చూరు వచ్చిన మంత్రి గొట్టిపాటి., ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి లబ్ధిదారులకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత పర్చూరు మార్కెట్‌ యార్డులో విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. సోలార్‌, ఆర్‌డీఎస్‌ఎస్‌, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లపై అధికారులతో చర్చించారు. విద్యుత్ శాఖకు చెందిన అన్ని పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. 5 వేల జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. లో-వోల్టేజ్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, తెన్నేటి కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ తో పాటు పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *