Breaking News

ఇథనాల్‌ శానిటైజర్ల దుర్వినియోగంపై ఆందోళన

-లైసెన్స్‌ మినహాయింపు ఎత్తివేయాలి
-కేంద్రానికి రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేఖ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇథనాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను కొందరు మద్యం ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న నేపథ్యంలో.. వాటి విక్రయాలపై నియంత్రణ అవసరమని రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పీ. అరుణ్‌బాబు, ఐఏఎస్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో శానిటైజర్ల నిల్వ, విక్రయాలకు ఇచ్చిన లైసెన్స్‌ మినహాయింపును ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్లకు వర్తించకుండా ఉపసంహరించాలని కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ (ఇండియా)కు లేఖ రాశారు.

కొవిడ్‌ సమయంలో శానిటైజర్ల సులభ లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వం 27-07-2020న ఎస్‌.ఓ.245(ఈ) నోటిఫికేషన్‌ ద్వారా వాటి నిల్వ, విక్రయాలకు సేల్‌ లైసెన్స్‌ నుంచి మినహాయింపు ఇచ్చిందని అరుణ్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఈ మినహాయింపును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో మద్యానికి బదులుగా ఇథనాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను కొందరు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఈ నేపథ్యంలో తనిఖీలు, దాడులు జరిపి కొన్ని రిటైల్‌ మెడికల్‌ షాపులు ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్లను పెద్ద మొత్తంలో విక్రయించినట్లు గుర్తించామన్నారు. విజయవాడ పటమటలోని సాయి వెంకటేశ్వర ఫార్మసీ అండ్‌ సర్జికల్‌కు సంబంధించిన బిల్లులను స్వాధీనం చేసుకున్నామని, వాటి ప్రకారం ఏడాదిన్నర కాలంలో సుమారు 33,586 ఇథనాల్‌ 70 శాతం వీవీ (100 ఎంఎల్‌) సీసాలను కొనుగోలు చేసి విక్రయించినట్లు వెల్లడైందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో మూడు రిటైల్‌ విక్రయ కేంద్రాలపై లైసెన్స్‌ రద్దు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఇచ్చిన మినహాయింపు నాలుగేళ్ల తర్వాత కూడా కొనసాగుతుండటం వల్ల ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్ల దుర్వినియోగానికి అవకాశం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మార్కెట్‌లో ఇథనాల్‌ లేని ప్రత్యామ్నాయ హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉన్నందున.. ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్ల నిల్వ, విక్రయాలకు సేల్‌ లైసెన్స్‌ నుంచి ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని పీ. అరుణ్‌బాబు కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌.ఓ.245(ఈ) నోటిఫికేషన్‌ను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *